అందుకే నన్ను బీదల డాక్టర్‌గా పిలిచేవాళ్లు... | MLA V M Abraham Life Story | Sakshi
Sakshi News home page

వైఎస్‌ ఆశీస్సులతో రాజకీయాల్లోకి..: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Published Sun, Jun 16 2019 7:34 AM | Last Updated on Sun, Jun 16 2019 8:09 AM

MLA V M Abraham Life Story - Sakshi

భర్త అబ్రహంకు భోజనం వడ్డిస్తున్న విజయలక్ష్మి

జీవితానికి సార్థకత లభించాలంటే ఏదో మంచి చేయాలి. ఆ మంచి పలువురికి ఉపయోగపడాలి. ఈ సిద్ధాంతాన్ని నమ్మడమే కాదు.. దాన్ని పాటించేందుకు ప్రయత్నించే వ్యక్తిని నేను. అందుకే వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి డాక్టర్‌ అయ్యాను. తర్వాత 12 ఏళ్లు అరబ్‌ దేశాల్లో వైద్యుడిగా పని చేసి కర్నూలుకి వచ్చేశా. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కర్నూలులోని కృష్ణానగర్‌లో ఓ క్లినిక్‌ తెరిచా. అప్పట్లో నా దగ్గరికి వచ్చే రోగుల నుంచి రూ.5 ఫీజు తీసుకునేవాడిని. కర్నూలుతో పాటు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అలంపూర్‌ నుంచి కూడా చాలా మంది వైద్యం కోసం వచ్చేవారు. వారిలో పేదలే ఎక్కువ. అలాంటి వాళ్ల దగ్గర రూ.5 కూడా తీసుకోలేదు. అందుకే ప్రజలు నన్ను బీదల డాక్టర్‌గా పిలవడం మొదలుపెట్టారు. ఆ అభిమానంతో నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకు అంకితమై ఉంటా.’’ 

ఆయనో వైద్యుడు.. ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఏమీ ఆశించకుండానే వైద్య సేవలందించే వ్యక్తి. మంచితనానికి, ఆప్యాయతకు మారుపేరుగా నిలిచిన ఆయనకు ప్రజలు ఇచ్చిన బిరుదు బీదల డాక్టర్‌. రోగులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నిస్వార్థ వైద్యుడిని ప్రజలు ఇంకా ఉన్నతంగా చూడాలనుకున్నారు. ఆయనలో ఉన్న సేవాగుణం.. జనానికి ఏదో చేయాలనే తపనను గుర్తించిన కొందరు ఆప్తులు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని పట్టుబట్టారు. వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్‌ ప్రజాసేవే పరమావధిగా భావించే ఆ ప్రజామనిషిని పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే దీనికంటే గొప్ప అవకాశం లేదనుకున్న ఆ జననేత..జనం అభీష్టం మేరకు వైద్యవృత్తిని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలూ ఆయన్ను తమ నాయకుడిగా ఆదరించారు. ఎమ్మెల్యేగా గెలిపించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించడంతో పాటు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పేదలకు ఆప్తుడయ్యారు. చేసే పని ఏదైనా.. పలువురికి మేలు చేసేలా ఉండాలి. అది మనకు సంతృప్తినివ్వాలి అని అంటోన్న అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ బీఎం అబ్రహంతో ‘సాక్షి’ పర్సనల్‌ టైం. 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : మాది జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వెంకటరమణ. అమ్మ గోవిందమ్మ. మేం ముగ్గురం అన్నాదమ్ములం. అన్న సుధాకర్‌ ప్రభుత్వ కాలేజీలో పని చేసి పదవీ విరమణ పొందారు. మరో అన్న ఏసన్న మా గ్రామం వల్లూరులో సర్పంచ్‌గా ఉన్నారు. మాకు చెల్లెళ్లు లేరు. కుటుంబంలో డాక్టర్‌ అయింది నేనొక్కడినే. నాన్న వ్యవసాయం చేసి మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా మా నాన్న పెద్దగా చదువుకోలేదు. ఆయన చదువుకోకపోవడంతో తన పిల్లలను బాగా చదివించాలని కోరిక బలంగా ఉండేది. అందుకే మా చదువుకు ప్రొత్సహించారు. ఎలాంటి లోటు రాకుండా వ్యవసాయంలో కష్టపడి చదువులు చెప్పించారు. ఆయన అందించిన ప్రోత్సాహంతో నేనే డాక్టర్‌గా రాణించాను. మా తమ్ముడు కూడా ప్రభుత్వ ప్రిన్సిపల్‌గా ఉద్యోగం సాధించాడు.

వ్యవసాయం కుటుంబం కావడంతో ఉన్న భూమి సాగు చేయడం కష్టంగా ఉంటుందని చిన్నవాడు వ్యవసాయంలో స్థిరపడ్డాడు. అమ్మ ఎప్పుడూ మా అన్నదమ్ముల చదువుకు ప్రోత్సహించేది. ప్రస్తుతం అన్నదమ్ములు. బంధువులందరూ వల్లూరులోనే ఉంటారు. నేను నా కుటుంబంతో కలిసి కర్నూలులో ఉంటున్న. ‘‘పన్నెండేళ్లు ఇరాన్, ఇరాక్, కువైట్‌ దేశాల్లో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యుడిగా పని చేశా. మంచి పేరు, డబ్బు సంపాదించా. అయినా అది నాకు తృప్తి ఇవ్వలేదు. అందుకే పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో  అన్నీ వదిలేసి ఇండియాకు తిరిగొచ్చేశా. కర్నూల్‌లు లో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ ప్రారంభించి అతితక్కువ ఫీజుతో 22 ఏళ్లు పేదలకు వైద్య సేవలందించా. నేను డాక్టర్‌గా ఉన్నప్పుడు రోగులు నా క్లినిక్‌కు వచ్చేటోళ్లు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేనే ప్రజల వద్దకు వెళ్తున్న. ఇంట్లో కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్న. అందరి సమస్యలు వింటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. డాక్టర్‌ వృత్తి కంటే ఎమ్మెల్యే పదవికి బాధ్యతలు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జనం నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మధ్యలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటా.’’ 

కుటుంబసభ్యులే కొండంత అండ 

ప్రజల మధ్య ఉండడమే నాకిష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన నాలో ఎక్కువ. ఓ వైద్యుడిగా.. ఎమ్మెల్యేగా ప్రజల కష్టసుఖాలు నాకు తెలుసు. అందుకే ఎవరికీ ఏ సమస్య వచ్చినా వారు నా దగ్గరికి వస్తారు. నా పరిధిలో ఉండే పని చేసి పెడతా. పని పూర్తయితే వాళ్ల మొఖంలో సంతోషాన్ని చూసి నేనూ ఆనందపడతా. నా కుటుంబసభ్యులే నాకు కొండంత అండ. నా సతీమణి విజయలక్ష్మి సహకారం అపూర్వం. కుటుంబబాధ్యతలు.. పిల్లల పెంపకం అంతా ఆమెనే చూసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిగాయి. జ్యోతి బీటెక్‌ చదివింది. అల్లుడు రవి బాబు(ఎంటెక్‌). ఇద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. మరో కూతురు మాన్‌సి అమెరికాలో డాక్టర్‌. అల్లుడు నవీన్‌ (ఇంజనీర్‌). ఇద్దరూ అమెరికాలోనే ఉంటున్నారు. కొడుకు అజయ్‌ బెంగళూరులో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ చదువుతున్నాడు.  

ఆ మాస్టారే లేకుంటే.. 
నేను వల్లూరులో నాలుగో తరగతి చదివేటప్పుడు స్కూలుకు డుమ్మా కొట్టేవాడిని. ఇంటి నుండి బయలుదేరి మధ్యలో ఉన్న పంట చేనులో దాక్కొనే వాడిని. ఆ సమయంలో ముహమ్మద్‌ హుస్సేన్‌ అనే మా మాస్టార్‌ నాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. నేను స్కూలుకు  రాకపోతే నా గురించి ఇంటికొచ్చేవారు. చేనుల వెంట తిరిగిన నన్ను చదువు వైపు దృష్టి మళ్లించిన మాస్టారు అంటే నాకు ఎంతో గౌరవం.

చేసిన అభివృద్ధి తృప్తినిచ్చింది  
కుటుంబం కంటే నా నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యమని భావిస్తా. అందుకే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు రూ. 580 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించా. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టుగా ఉన్న అలంపూర్‌ మండలంలో రూ.66కోట్లతో మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టిన. దీంతో 8వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతోంది. రూ.6.25కోట్లతో ఐదు మండల కేంద్రాల్లో కేజీబీవీ భవనాలు, రూ.1.50 కోట్లతో అలంపూర్, అయిజలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలు, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మండలాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల భవనాలు నిర్మించా. ఏళ్ల తరబడిగా మరుగునపడిన అలంపూర్‌ చౌరస్తా–అయిజ రహదారిని రూ.78 కోట్లతో ఆధునీకీకరించా. రూ.14కోట్ల వ్యయంతో ఎస్సీ రెసిడెన్షియల్‌ భవనం, రూ.10 కోట్లతో అలంపూర్‌లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టాను.  

సర్కారు చదివే.. 
నా విద్యాభ్యాసమంతా సర్కారు విద్యా సంస్థల్లోనే జరిగింది. అలంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివా. గద్వాలలో ఏడో తరగతి వరకు, మహబూబ్‌నగర్‌లో ఇంటర్‌ పూర్తి చేశా. తర్వాత 1974లోనే హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. చిన్నప్పటి నుండే పేదలకు సేవ చేయాలనే తపన నాలోఉండేది. అందుకే డాక్టర్‌నయ్యా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement