డిఫెన్స్ ఎక్స్‌పోలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, చెన్నై/తిరువిడందై: 15వ ఆర్థికసంఘం నిబంధనలు కొన్ని రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా నియంత్రణకోసం పనిచేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలంటూ కేంద్రమే ఆర్థిక సంఘానికి సూచించిందని గురువారం చెన్నైలో వెల్లడించారు. ఇటీవల కేరళలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. కేంద్రంపై విమర్శలు చేసిన నేపథ్యంలో మోదీ ఈ వివరణనిచ్చారు. అంతకుముందు, కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపం తిరువిడందైలో డిఫెన్స్ ఎక్స్‌పోను మోదీ లాంఛనంగా ప్రారంభించారు.
భారత సాయుధ దళాలను మరింత బలోపేతం చేసేందుకే దేశాన్ని రక్షణ రంగ తయారీ కేంద్రంగా మార్చే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆదర్శమని, అలాగని సమరానికి సన్నద్ధంగా రక్షణశాఖను బలోపేతం చేసుకోవడంలో తప్పులేదన్నారు. కాగా, కావేరీ బోర్డు ఏర్పాటుపై కేంద్రం ఇంతవరకు స్పందించకపోవటంతో ఈ పర్యటనలో తమిళులు మోదీకి నల్లజెండాలతో నిరసన తెలిపారు. మరోవైపు, విపక్షాలు పార్లమెంటు కార్యక్రమాలను జరగనివ్వకపోవటానికి నిరసనగా బీజేపీ ఎంపీలు దేశవ్యాప్తంగా గురువారం ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రధాని మోదీ కూడా ఈ దీక్షలో ఉంటూనే తమిళనాడులో పర్యటించారు.
తమిళనాడుకు లాభమే: మోదీ
కేరళలో ఇటీవల జరిగిన భేటీలో కేరళ, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. 1971 జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అయితే.. ఈ సమావేశానికి తమిళనాడు హాజరుకాకపోయినా.. 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవటం ద్వారా కేంద్ర పన్ను ఆదాయం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విమర్శించింది.
అయితే ఈ నిబంధనల ద్వారా తమిళనాడు వంటి రాష్ట్రాలకు మేలే జరుగుతుందని గురువారం నాటి కార్యక్రమంలో ప్రధాని పేర్కొనటం గమనార్హం. ‘15వ ఆర్థిక సంఘాన్ని అడ్డంపెట్టుకుని ఓ ప్రాంతం, ఓ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారం అర్థరహితం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మా మంత్రం. మనమంతా కలసి నవభారత నిర్మాణానికి పనిచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా చేయాలి’ అని మోదీ పేర్కొన్నారు.
యూపీఏ విధానాల వల్లే..
దేశ సరిహద్దులను కాపాడుకోవటంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే పొరుగుదేశాలతో శాంతి నెలకొల్పటంలోనూ ఉందని మోదీ స్పష్టం చేశారు. తమిళనాడులోని ఈ కార్యక్రమంలో పలు స్వదేశీ, విదేశీ రక్షణ రంగ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల దేశంలో రక్షణ రంగం చతికిలబడిందని మోదీ విమర్శించారు. దీని మూలంగా భారత మిలటరీ యుద్ధ సంసిద్ధతపై ప్రభావం పడిందన్నారు. ‘నాటి రాజకీయ అచేతనం కారణంగా దేశంలో అత్యంత కీలకమైన రక్షణ సంసిద్ధత మూలనపడింది.
వారి సోమరితనం, అసమర్థత, బయటకు కనిపించని ఉద్దేశాల కారణంగా జరిగిన నష్టాన్ని మనం చూశాం. గత ప్రభుత్వం పరిష్కరించాల్సిన చాలా సమస్యలను ఇప్పుడు మేం పరిష్కరిస్తున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రపంచ శాంతి, ఐకమత్యం, సామరస్యం కోసం భారత్ ఎప్పుడూ త్యాగం చేస్తూనే ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలను గుర్తుచేసుకోండి. వేల ఏళ్ల భారత చరిత్రను చూసుకోండి. మా దేశం ఎప్పుడూ సామ్రాజ్యకాంక్షతో ఇతర దేశాలపై దండెత్తలేదు. రాజ్యాలను, దేశాలను గెలవటం కంటే ప్రజల మనసులు గెలవటాన్నే మేం విశ్వసిస్తాం. వైదిక కాలం నుంచి శాంతి, సోదరభావం వంటి సందేశాలను ప్రపంచానికి ఇచ్చిన పుణ్యభూమి ఇది’ అని మోదీ పేర్కొన్నారు.
ఎగుమతిచేసే సామర్థ్యానికి..
‘2014 మేలో రక్షణ రంగ ఎగుమతుల అనుమతుల సంఖ్య 118 అని.. దీని విలువ దాదాపు రూ.3,767 కోట్లు. కానీ మేమొచ్చాక నాలుగేళ్ల లోపలే 794 ఎగుమతుల అనుమతులిచ్చాం. వీటి విలువ దాదాపు రూ.84వేల కోట్లు. రక్షణ రంగ సేకరణ విధివిధానాలను కూడా ఇరువర్గాలకు మేలు చేసేలా సమీక్షించాం. స్వదేశీయంగా రక్షణ రంగ పరిశ్రమ వృద్ధి చెందాలనేదే మా లక్ష్యం’ అని ప్రధాని పేర్కొన్నారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో రక్షణశాఖ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలది ప్రధానపాత్ర అన్న మోదీ.. ఈ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతి చేయగల సామర్థ్యాన్ని సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తమిళనాట ‘గోబ్యాక్ మోదీ’
చెన్నై: ప్రధాని మోదీ ఒక రోజు పర్యటన సందర్భంగా తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై కేంద్ర వైఖరికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. గోబ్యాక్ మోదీ అని రాసి ఉన్న బెలూన్లను ఎగురవేశారు. ప్రధాని మద్రాస్ ఐఐటీకి వెళ్లే సమయంలో కొందరు ఆయన వ్యతిరేక నినాదాలు చేశారు.
డీఎంకేతోపాటు సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే పార్టీల నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. చెన్నైతోపాటు దిండిగల్, కరూర్, రామనాథపురం, విరుధునగర్, మదురై, కోయంబత్తూర్‌లలోనూ ఇదే విధంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితర నేతల ఇళ్ల వద్ద నల్లజెండాలు ఎగురవేశారు. ఎప్పుడూ తెల్లని దుస్తుల్లో కనిపించే కరుణానిధితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కనిమొళి నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
చెన్నైలో మోదీ వ్యతిరేక నినాదాలిస్తున్నకనిమొళి, డీఎంకే నేతలు
దేశీయంగా ఫైటర్ జెట్ల తయారీ
తిరువిడందై: ఎఫ్‌ఏ–18 సూపర్ హార్నెట్ విమానాలను భారత్‌లోనే తయారుచేసేందుకు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ముందుకొచ్చింది. ఈ మేరకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(ఎండీఎస్)లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం..మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ విమానాల తయారీకి మన దేశంలో అధునాతన రక్షణ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు.
ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లోనే భవిష్యత్ సాంకేతికతలను రూపొందిస్తామని బోయింగ్ వెల్లడించింది. చెన్నైలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్‌పోలో రెండో రోజైన గురువారం ఈ నిర్ణయం వెలువడింది. భారత వాయుసేనకు 110 యుద్ధ విమానాలను సరఫరా చేసే డీల్ రేసులో లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, డసాల్ట్ తదితర దిగ్గజ కంపెనీలతో పాటు బోయింగ్ కూడా ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇక్కడే తయారీని ప్రారంభిస్తే సుమారు 15 బిలియన్ డాలర్ల ఆ కాంట్రాక్టు కూడా బోయింగ్‌కే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment