విపక్షాలతో భేటీ తర్వాత బయటికొస్తూ కాంగ్రెస్ నేత ఖర్గేతో మాట్లాడుతున్న మోదీ. చిత్రంలో గోయల్, అనంత్‌కుమార్ తదితరులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 18 సిట్టింగుల్లో మొత్తం 24 రోజుల పాటు జరిగే సభా కార్యకలాపాలు ఆగస్టు 10న ముగుస్తాయి. ఈసారి 46 బిల్లులను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విపక్ష పార్టీల నాయకులతో సమావేశమై సభ సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను లేవనెత్తాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
‘సభ సజావుగా, ఫలవంతంగా జరిగేందుకు ప్రధాని మోదీ విపక్షాల సహకారం కోరారు. జాతీయ ప్రయోజనాల విషయాలపై పార్లమెంట్ చర్చిస్తుందని దేశం మొత్తం ఆశతో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తే సమస్యలను చర్చించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. సమావేశాల్లో నిర్మాణాత్మక, సానుకూల వాతావరణం సృష్టించేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. సభను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది’ అని తెలిపారు.
ఉభయ సభల్లో ప్రతిష్టంభనను చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు. ఉన్నత విద్యా సంస్థల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల తొలగింపు, మూక దాడుల నియంత్రణకు చట్టం రూపకల్పన తదితరాలను విపక్ష నాయకులు లేవనెత్తారు. రిజర్వేషన్లపై చర్చ జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు సభను సజావుగా జరగనీయమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా వేర్వేరుగా అఖిల పక్ష భేటీలు నిర్వహించారు.
చర్చ జరిగితే వారి అనైక్యత బట్టబయలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగితే ప్రతిపక్షాల అనైక్యత బయటపడుతుందని అధికార ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఎస్పీ, ఆర్జేడీ లాంటి పార్టీలు బిల్లు ప్రస్తుత రూపాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఎన్డీయే పక్షాల సమావేశం తరువాత బీజేపీ మిత్ర పక్ష నాయకుడు ఒకరు ఇదే విషయమై స్పందిస్తూ..వెనకబడిన, అణగారిన వర్గాలకు చెందిన కొందరు ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో తమ వర్గానికి ఉపకోటా కోరుతూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.బీజేపీ మిత్రపక్షం ఎల్జేపీ కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది.
పలు పంటలకు మద్దతు ధరలను పెంచినందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ఎన్డీయే మిత్రపక్షాలు ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినందుకు మరో తీర్మానానికి కూడా పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఎన్డీయే కూటమి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, తమ కుటుంబం వేగంగా విస్తరిస్తోందని అన్నారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా తదితర కీలక బిల్లులపై చర్చించి ఆమోదించేందుకు తమతో కలసిరావాలని కేంద్రం కాంగ్రెస్‌ను కోరింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
కేంద్రంపై మళ్లీ అవిశ్వాసం
ఈ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రకటించింది. ఇందు కోసం ఇతర ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. మూక హత్యలు, మహిళా భద్రత తదితర కీలక సమస్యలను లేవనెత్తుతామని పేర్కొంది. అనుమానాలతో వ్యక్తులను కొట్టి చంపడం, గో సంరక్షణ పేరిట దాడులు సర్వసాధారణమయ్యాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం?
‘ముస్లిం కాంగ్రెస్’ వ్యాఖ్యలు పార్లమెం ట్‌లో దుమారం రేపే అవకాశాలున్నాయి. కీలకమైన మూడు రాష్ట్రాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రధాన అస్త్రంగా మారనున్నా యి.
కొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలపై వ్యతిరేకతను తట్టుకోవటంతోపాటు, వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు గాను తమ హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా ఈ అంశాన్ని మార్చుకోవాలని కూడా బీజేపీ నాయకులు యోచిస్తున్నారు.
ఆర్థిక రంగ వైఫల్యాలు, దేశ వ్యాప్తంగా అమాయకులపై దాడులు, రాజకీయ అంశాలపై ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు యత్నిస్తే రాహుల్ వ్యాఖ్యలను అధికార బీజేపీ ప్రధాన అంశంగా తెరపైకి తెచ్చే అవకాశాలు న్నాయి. గత బడ్జెట్ సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు అవకాశాలు లేవని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment