సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భారీ కుదుపుకు గురవుతున్నాయి. తృణమూల్ ఆవిర్బావం నుంచి ఆ పార్టీకీ సీనియర్ నేతగా, ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న ముకుల్ రాయ్ పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు, పార్టీ పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి దుర్గా పూజల అనంతరం రాజీనామా చేస్తానని ముకుల్ రాయ్ ప్రకటించారు. దుర్గా పూజల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. శారదా చిట్‌ఫండ్ స్కామ్ బయటకు వచ్చాక ముకల్ రాయ్‌ని మమతా బెనర్జీ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు. అప్పటినుంచి ముకుల్ రాయ్‌ని మమతా బెనర్జీ నెమ్మదిగా పక్కనపెడుతూ వస్తున్నారు.
బీజేపీవైపు..!
తృణమూల్‌కు రాజీనామా చేసిన అనంతరం.. ఆయన భారతీయ జనతాపార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాజీనామా తరువాత మీరు బీజేపీలో చేరే అవకాశం ఉందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధాన మిస్తూ.. 5 రోజులు ఆగండి.. మీకే తెలుస్తుంది అని ముకుల్ రాయ్ చెప్పారు. ఒకవేళ ముకుల్ రాయ్ బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి పెద్ద ఊపు వస్తుందని రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి బాగా కలిసి వస్తుందనే అంచనాలున్నాయి.