
సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మురళీధర్‌రావు (జతచేసిన చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు గ్రూపులు లేవని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. కులాల ఆధారంగా తమ పార్టీ పదవులు ఇవ్వదని తెలిపారు. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన ఓబీసీ అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు.
కాగా, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మద్దతుదారులు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించిన వీర్రాజుకు ఆశాభంగం ఎదురవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కర్ణాటకలో గెలుపు మాదే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందని మురళీధర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా లేరని తెలిపారు. ఈ నెల 15 తర్వాత 2019 వ్యూహాలను వెల్లడిస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకెళ్లినా, ఆయనకు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.