సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వీర్రాజుకు గతంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుతుందని అంతా భావించినా.. పార్టీలోనే కొందరు నేతలు మోకాలడ్డినట్టు విమర్శలు వచ్చాయి.
మండల నాయకుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు..
సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము సూర్యారావు, గంగమ్మ దంపతులకు 1957లో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన ఆయన బీఎస్సీ చదివారు. వృత్తి వ్యాపారం. వీర్రాజు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి.
– 1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా అరంగేట్రం చేశారు 1980లో యువమోర్చా తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2006–10 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010–13 తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు మొదటిసారి, 2014 నుంచి ఇప్పటి వరకు రెండోసారి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు.
– ప్రస్తుతం ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు.
శుభాకాంక్షలు తెలిపిన జీవీఎల్
బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తి ఎదుగుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీర్రాజు నాయకత్వంలో పార్టీ బలమైన రాజకీయ పార్టీగా ముందుకు వెళుతుందని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.
పార్టీ నిర్ణయానికి సర్వదా కృతజ్ఞుడను. ప్రధాని నరేంద్ర మోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షాలు పార్టీకి, రాష్ట్రానికి ఒక మంచి దిశను అందించారు. – సోము వీర్రాజు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు
Published Tue, Jul 28 2020 2:43 AM | Last Updated on Tue, Jul 28 2020 9:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment