సాక్షి, సంగారెడ్డి : స్వాతంత్రానంతరం ఇందిరాగాంధీ హయాం తర్వాత రెండవసారి పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే అన్ని పార్టీల కంటే బీజేపీ భిన్నమైనదని ఆయన పేర్కొన్నారు. చాలా పార్టీలు తమ కుటుంబం,కులం లేదా వ్యక్తుల కోసమే పనిచేస్తాయని , మా పార్టీ కార్యకర్తలు మాత్రం దేశం కోసం పని చేస్తారని పేర్కొన్నారు. అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేని పార్టీలు బహిరంగంగా రక్షిస్తాయి అనడం కేవలం నినాదమేనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదని , భవిష్యతులో టీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయంగా మా పార్టీయే నిలుస్తుందని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ హీరో కాదు జీరో' అని విమర్శించారు. కేంద్రంలో ఫసల్ భీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమల్లో ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వీటిని ఇంత వరకు ప్రవేశపెట్టలేదని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను టీఆర్‌ఎస్ పక్కదారి పట్టిస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బ్యాటరీ లేని పార్టీ అని, దానికి చార్జింగ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ 17 రాష్ట్రాలలో నామరూపాళ్లు లేకుండా పోయిందని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment