స్పెషల్‌ చాలీస్‌ | Muslim voters are the decisive force in 40 constituencies | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ చాలీస్‌

Published Mon, Nov 5 2018 4:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Muslim voters are the decisive force in 40 constituencies - Sakshi

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు కీలకపాత్ర పోషించనున్నారు. మూడింట ఒక వంతు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వీరు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుంటే, అందులో దాదాపు 40 నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖలో ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు బలంగా ఉన్నారు. వీటిలో కనీసం ఏడు స్థానాల్లో ‘ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఏ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌’ (ఏఐఎంఐఎం) పాగా వేయడం లాంఛనమే. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల్లో అభ్యర్థులను నిలబెడితే.. ఇతర పార్టీల గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. 

ఆ నలభై కీలకం..
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఉన్నా.. నిర్ణయాత్మక శక్తిగా ఉన్నవి మాత్రం 40 నియోజకవర్గాలు ఉంటాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 12.7 శాతం మేరకు ముస్లిం జనాభా ఉంది. గతంలో ముస్లింలు కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉండేవారు. అయితే బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఎంఐఎం ఎదిగింది. ఒకప్పుడు కేవలం హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితమైన మజ్లిస్‌ పార్టీ తరువాత తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకూ విస్తరించింది.

అక్కడ రాజకీయంగా నిలదొక్కుకోలేకపోయినప్పటికీ.. ప్రతి ఎన్నికల సమయంలో ఆ ప్రాంతాల ముస్లింలను ప్రభావితం చేయడంలో మాత్రం సఫలీకృతమవుతోంది, ఎంఐఎం నేరుగా ప్రధాన రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోకున్నా.. ‘ఫ్రెండ్లీ పార్టీ’గా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం అధికార పార్టీకి అండగా ఎంఐఎం మెలుగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఉమ్మడి జిల్లా్లలైన నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మంలలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలోఉన్నారు.

మొగ్గు ఎటువైపో..?!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ అంశాన్ని పక్కన పెట్టేసి, అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది.  దానికి తోడు తెలంగాణ రాష్ట్ర సమితి మైనారిటీలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో.. ముస్లింలకు విద్య, ఉపాధి రంగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రక్రియను కొనసాగించింది. అయితే అది న్యాయస్థానంలో నిలబడలేదు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ముస్లింలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు.

ఆయన మరణానంతరం వారంతా కాంగ్రెస్‌ పార్టీకి దూరమవుతూ వచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై చిత్తశుద్ధితో పనిచేయలేదని ప్రతిపక్షం ప్రధానంగా విమర్శిస్తోంది. మైనారిటీలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మేనిఫెస్టోలో లేకపోయినా.. కల్యాణలక్ష్మి తరహాలో ముస్లింలకు షాదీ ముబారక్, రంజాన్‌ తోఫా పథకాలను ప్రవేశపెట్టింది. ముస్లిం మైనారిటీలు విద్యాపరంగా బాగా వెనుకబడిన విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ వర్గం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించడంతో ప్రభుత్వంపై ఆ వర్గం ప్రజలకు నమ్మకం పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ముస్లింలను తన వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ స్థానాల్లో హవా..
- హైదరాబాద్‌ పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్‌ స్థానాల్లో ముస్లిం ఓట్లు అధికం.
నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో 20 వేల నుంచి 28 వేల చొప్పున ముస్లిం ఓటర్లు ఉంటారు. ఇంకా నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోనూ వారి ప్రభావం ఉంది.
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల్లో పది వేల నుంచి 30 వేల చొప్పున ముస్లిం ఓటర్లు ఉంటారు.
- వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ తూర్పు, మహబూబాబాద్‌ స్థానాల్లో బలంగా ఉన్నారు.
ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో, మహబూబ్‌నగర్‌  నియోజకవర్గంలో 30 వేల వరకు ముస్లిం ఓటర్లు ఉంటారు. మక్తల్‌లోనూ ప్రభావం చూపేస్థాయిలో ఉన్నారు.
కరీంనగర్, జగిత్యాల సెగ్మెంట్లలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు
ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్, ఆదిలాబాద్‌ సెగ్మెంట్లలో వీరిది నిర్ణయాత్మక పాత్ర. ముథోల్‌లో 1.72 లక్షల ఓటర్లలో 38 వేల వరకు ముస్లింలు ఉంటారు. ఆదిలాబాద్‌ సెగ్మెంట్‌లో 1.96 లక్షల మంది ఉంటే 35 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు
రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూర్‌లో వీరి ఓట్లే కీలకం. రాజేంద్రనగర్‌లోనూ ఎంఐఎంకు గెలిచే సత్తా ఉంది.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని.. నిజామాబాద్‌ అర్బన్‌లో 40 వేల మంది ముస్లింలు ఉంటారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. బోధన్‌ నియోజకవర్గంలోనూ 35 వేల మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 25 వేల మేరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. 

ముస్లిం ప్రభావిత నియోజకవర్గాలు:     40
వీటిలో హైదరాబాద్‌ పరిధిలోని స్థానాలు:    15
(వీటిలో పూర్తిగా ముస్లిం ఆధిక్యత గల స్థానాలు 7)
రాష్ట్రంలో ముస్లిం జనాభా శాతం:    12.7

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement