
సాక్షి, హైదరాబాద్: నరనరానా రైతు వ్యతిరేకత ప్రవహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం రావడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం మరీ చోద్యంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు నాగిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 నాటికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారట! ఈ విషయం ఇక్కడి రైతులకు, ప్రజలకు తెలియదని పేర్కొన్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి వారికి ఏం చెప్పిందో, ఏం చేసిందో గానీ... ప్రకృతి వ్యవసాయానికి చంద్రబాబు ఏవో సేవలు చేస్తున్నారని భావించి ఆయనను వచ్చే నెల 24న న్యూయార్క్ కార్యాలయంలో ప్రసంగించాలని కోరారని తెలిపారు. మాయమాటలు చెప్పి మోసం చేయడంలో చంద్రబాబు అంతర్జాతీయ స్థాయికి ఎదిగినట్లు ఈ వ్యవహారం నిరూపిస్తోందని నాగిరెడ్డి పేర్కొన్నారు.
అందుకు మీరు అర్హులేనా?
వ్యవసాయాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసి, చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రైతులను మోసగించి, అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో తాను ప్రకృతి వ్యవసాయాన్ని బాగా చేయిస్తున్నట్టుగా అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్ చేశారంటే... ఇది మన రైతులు, ప్రజలు గర్వపడాల్సిన విషయమా? గత నాలుగున్నరేళ్లలో రైతుకు, వ్యవసాయానికి చంద్రబాబు చేయని ద్రోహం ఉందా? అని ఎంవీఎస్ నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. రైతు వ్యతిరేకి అయిన సీఎం చంద్రబాబు వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో అంతర్జాతీయ గౌరవాలను అందుకునేందుకు అర్హుడేనా? అసలు ఆయనను ఎందుకు గౌరవించాలి? అని నిలదీశారు. చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలను సంధించారు. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బాబూ మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి?
♦ వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం విడిపిస్తానంటూ ఇచ్చిన హామీలు అమలు కాక బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తుంటే, రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకులు నోటీసులు ఇస్తుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చోద్యం చూస్తున్నందుకా? రైతుల రుణాలు అప్పు స్థాయి నుంచి నిప్పు స్థాయికి చేరినందుకా? ఈ విషయాన్ని నాబార్డ్ సర్వే కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకా?
♦ వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని ఊదరగొట్టి నేడేమో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తిరుగుతూ మా దగ్గర మిగులు విద్యుత్ ఉంది రాయితీలిస్తాం రమ్మని చెబుతూ నేటికీ 9 గంటలు విద్యుత్ ఇవ్వకుండా దగా చేస్తున్నందుకా?
♦ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానని ప్రకటించి, 2016లోనే ఈ సిఫార్సులు అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎన్డీయే సర్కారులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉండి రైతులను మోసం చేసినందుకా?
♦ రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసినందుకా?
♦ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలోని 38 ప్రాజెక్టులను 2018–19 నాటికి (పోలవరం, వెలిగొండతో సహా) రూ.19,372 కోట్లతో పూర్తి చేస్తానని ప్రణాళికను ప్రకటించి, రూ.56,000 కోట్లు దోచుకొని ఇప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, వాటిని అవినీతి పారుదల ప్రాజెక్టులుగా మార్చినందుకా?
♦ మీ పాలనలో ఖరీఫ్, రబీలో పంటల సాగు దారుణంగా పడిపోయినందుకా? కరువుతో అల్లాడుతున్న రైతు కుటుంబాలు వలస బాట పట్టినా రాష్ట్రంలో వ్యవసాయభివృద్ధి బాగా జరుగుతోందని మభ్య పెడుతున్నందుకా?
♦ ఈ సంవత్సరం రాష్ట్రంలో తీవ్ర కరువుతో 393 మండలాలు, అధిక వర్షాలతో 160 మండలాలు దెబ్బతిన్నా 275 మండలాలే కరవు మండలాలని, 141 మండలాలే అ«ధిక వర్షాలకు దెబ్బతిన్నాయని ప్రజలను వంచిస్తున్నందుకా?
♦ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ప్రజావాసాలు కలిపి 2 కోట్ల ఎకరాల భూమి మాత్రమే ఉంటే 2 కోట్ల ఎకరాలకు సాగు నీరందిస్తానని ప్రజలను దగా చేస్తున్నందుకా?
♦ రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నా కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటలు పండిస్తామని ఇంకా చెబుతున్నందుకా?
♦ దేశంలో 1970వ దశకం వరకు సేంద్రియ వ్యవసాయమే జరిగిందనే వాస్తవాన్ని పక్కన పెట్టి, ఇదేదో తానే కనిపెట్టానని, 60 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపడతామని పాలన చివరి దశలో ప్రకటించి ఏకంగా అంతర్జాతీయ సంస్థలను కూడా వంచిస్తున్నందుకా? సేంద్రీయ వ్యవసాయంపై అబద్ధాలు చెబుతున్నందుకా?
♦ భారతదేశంలో రైతు కుటుంబాల సరాసరి ఆదాయం రూ.8,931 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబాల సరాసరి ఆదాయం రూ.6,920 మాత్రమే ఉండి దేశంలోనే 28వ స్థానానికి పడిపోయినందుకా?
♦ ఏపీ రైతులు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి కుటుంబాలను పోషించుకోలేక కష్టాలు పడుతున్నందుకా?
♦ భూసేకరణ పరిహార చట్టం–2013ను రైతులకు వ్యతిరేకంగా మార్చేసి 10 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కునే భూ విధానాన్ని అమలు చేస్తున్నందుకా?
♦ వ్యవసాయ ఉత్పత్తులకు అత్యల్ప స్థాయిలో కనీస మద్దతు ధరలు ఉన్నప్పటికీ ఈ విషయంలో ప్రధానమంత్రికి ఇప్పటికీ లేఖ రాయకుండా ఉన్నందుకా?