కాంగ్రెస్‌లో నాగం ‘లొల్లి’ | Nagam Janardhan Reddy To Join Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో నాగం ‘లొల్లి’

Published Fri, Feb 23 2018 2:54 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Nagam Janardhan Reddy To Join Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త లొల్లి ప్రారంభమయింది. బీజేపీ అసంతృప్త నేత నాగం జనార్దనరెడ్డిని పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్‌ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నాగంను చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో గుర్తింపు పొందిన నేత కాంగ్రెస్‌లో చేరారన్న భావన ప్రజల్లో కల్పించాలని పీసీసీ నాయకత్వం ఆలోచిస్తుండగా, పాలమూరు జిల్లాకు చెందిన నేతలు మాత్రం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు నాగం రాకను వ్యతిరేకిస్తూనే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తుండడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది.  

నాగం రాక.. ఆగమేనా?
తెలంగాణ రాజకీయాల్లో నాగం జనార్దనరెడ్డికి తనదైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన గత ఎన్నికలకు ముందే టీడీపీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం బీజేపీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. నాగం జనార్దనరెడ్డి కుమారుడు కూడా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీలో తన స్థానాన్ని పదిలపర్చుకోలేక నాగం అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింపులేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుందనే ఆలోచనతో కొంతకాలం క్రితం పావులు కదిపారు. తనతోపాటు కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించారు. నాగం కాంగ్రెస్‌లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే అరుణ పార్టీ పెద్దలకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాగం రాకను సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్యతోపాటు ఎమ్మెల్సీ, నాగర్‌కర్నూలు ఇంచార్జి దామోదర్‌రెడ్డితో కలసి ఆమె ఏకంగా పార్టీ అధినేత రాహుల్‌ను కలిశారు. అయితే, అలాంటిదేమీ ఉండదన్న రాహుల్‌ హామీతో ఢిల్లీ నుంచి వచ్చిన డీకే అరుణ వర్గం, నాగం చేరికపై తాజా ప్రచారంతో అవాక్కయ్యారు.

ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకుని నాగం ఢిల్లీలో రాహుల్‌ని కలసి లైన్‌ క్లియర్‌ చేసుకున్నారన్న వార్తలు రావడంతో అరుణ శిబిరం మళ్లీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి నాగంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో అవగాహనతోనే నాగం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన పార్టీలోకి వస్తే జిల్లాలో గ్రూపు రాజకీయాలు పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదని అంటున్నారు. గత ఎన్నికలలో నాగం ఓడిపోయారని, ఆయన కొడుక్కి డిపాజిట్‌ రాలేదని, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న నాగంను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

అదే జరిగితే నాగర్‌కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని దామోదర్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో డీకే అరుణ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే జైపాల్‌రెడ్డి నాగం చేరికను ప్రోత్సహిస్తున్నారని దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు.

పీసీసీ సుముఖం!
మరోవైపు పీసీసీ నాయకత్వం మాత్రం నాగంను పార్టీలో చేర్చుకునే విషయంలో సుముఖంగానే ఉందని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో డీకే అరుణ వర్గానికి తేల్చిచెప్పారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ నాయకత్వం ఆలోచనలకు అనుగుణంగా నాగం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారా, డీకే అరుణ ఎలాంటి పావులు కదుపుతారు, ఒకవేళ నాగం పార్టీలో చేరితే పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలెలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement