అహ్మదాబాద్: గుజరాత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమమే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అహ్మదాబాద్‌లో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన ఈ కార్యక్రమం కారణంగా గుజరాత్‌లో కరోనా వ్యాపించిందని పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్దా సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్-19ను రాష్ట్రంలో వ్యాప్తి చేయడంలో బీజేపీ పాత్రపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా త్వరలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. (జర్నలిస్టును బలి తీసుకున్న కరోనా)
నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన అహ్మదాబాద్ అత్యధిక కరోనా ప్రభావిత నగరాల్లో ఒకటిగా మారడం యాదృచ్చికమా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ‘నమస్తే ట్రంప్ ప్రచార కార్యక్రమం కారణంగా అహ్మదాబాద్ రాష్ట్రంలో కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. కరోనా మరణాల్లో 73 శాతం అహ్మదాబాద్‌లోనే సంభవించాయి. నమస్తే ట్రంప్ కార్యక్రమం కారణంగా, గుజరాత్ మాత్రమే కాదు, దేశం మొత్తం దానికి మూల్యం చెల్లిస్తోంద’ని గుజరాత్ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ పేజీలో పేర్కొంది.
ఆరోపణలు నిరాధారం: బీజేపీ
కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర బీజేపీ తోసిపుచ్చింది. కోవిడ్-19ను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించక ముందే నమస్తే ట్రంప్ కార్యక్రమం జరిగిందని తెలిపింది. ఈ కార్యక్రమం జరిగిన నెల రోజుల తర్వాత గుజరాత్‌లో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైందని వెల్లడించింది. కాగా, నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లోని మొతారా క్రికెట్ స్టేడియంతో లక్షకుపైగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి మోదీతో కలిసి ట్రంప్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం గుజరాత్‌లో ఇప్పటివరకు 7,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 425 మరణాలు సంభవించాయి. కరోనా బారి నుంచి 1,709 మంది కోలుకున్నారు. (వారం పాటు అహ్మదాబాద్ షట్‌డౌన్)
Comments
Please login to add a commentAdd a comment