
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ. పద్మారావు, టీఆర్‌ఎస్ నేతలపై గతంలో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. పద్మారావుతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలపై ఎన్నికల సమయంలో కేసులు దాఖలయ్యాయి. 2014 ఎన్నికల్లో సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ.. పద్మారావు, ఆయన అనుచరులపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విచారణ సందర్భంగా మంత్రి పద్మారావు, ఆయన అనుచరులు బుధవారం నాంపల్లిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసు పూర్వపరాలను విచారించిన జిల్లా మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేసింది. టీఆర్‌ఎస్ నేతల తరఫున న్యాయవాది సంతోష్ రెడ్డి కోర్టులో తమ వాదనలను వినిపించారు.