వాజ్‌పేయ్‌కి సంతాపం తెలపడంలోనూ కామెడీ! | Nara Lokesh comments was viral in social media | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘పప్పు’లో కాలు! 

Published Mon, Aug 20 2018 3:36 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Nara Lokesh comments was viral in social media - Sakshi

సాక్షి, అమరావతి: తరచూ తడబడే ముఖ్యమంత్రి తనయుడు, ఐటీశాఖా మంత్రి నారా లోకేష్‌ మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌కి సంతాపం తెలపడంలోనూ కామెడీ పండించారు. వాజ్‌పేయ్‌ కన్నుమూత సందర్భంగా లోకేష్‌ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్‌ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌పేయ్‌ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్‌ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ఇంతకీ ఈ సంతాప సందేశం ఎవరికి? అంటూ చురకలు అంటిస్తున్నారు. సంతాప సందేశాన్ని కవిత్వంతో ప్రారంభించి చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల విపరీతంగా వైరల్‌ అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో దీనిపై తెగ సెటైర్లు పేలాయి. లోకేష్‌ తీరును సమర్థించుకోలేక టీడీపీ శ్రేణులు నానా తంటాలు పడుతున్నాయి.  

తేడా లేదా? 
ప్రతి సందర్భంలో తప్పులు మాట్లాడడం, తెలుగు పదాలను సరిగా పలకలేకపోవడం, కంగారులో రివర్స్‌లో మాట్లాడడంతో నారా లోకేష్‌ మొదటి నుంచి సోషల్‌ మీడియాకు మసాలా దినుసుగా మారిపోయారు. అంబేడ్కర్‌ జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో రెండిటికీ తేడా తెలియని లోకేష్‌ అంటూ విమర్శల వర్షం కురిసింది. మరో సందర్భంలో మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ లోకేష్‌ నోరుజారి పార్టీ పరువు తీయడంతో సోషల్‌ మీడియా అంతా జోకులు పేలాయి.  

తెలుగులో తడబాటు 
లోకేష్‌ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు నిమిషాల్లో నాలుగు తెలుగు పదాలను కూడా చెప్పలేక తడబడడాన్ని నెటిజన్లు ఉతికి ఆరేశారు. అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ పార్టీ శ్రేణులతో వాఖ్యానించడంతో సోషల్‌ మీడియాలో వెల్లువెత్తిన సెటైర్లకు మొహం చాటేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లోకేష్‌ తన ఇంటి డాబాపై జాతీయ జెండా ఎగురవేసి బద్ధకాన్ని చాటుకున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.  

ఫలించని ప్రత్యేక శిక్షణ 
లోకేష్‌ తరచూ తప్పులో కాలేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోని చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించి తర్ఫీదు ఇచ్చారు. తెలుగు తెలిసిన పెద్దలతో చినబాబుకు ట్యూషన్‌ చెప్పించారు. చివరికి సాధ్యమైనంత తక్కువగా మాట్లాడేలా కట్టడి చేసినా ఎక్కడో ఒకచోట దొరికిపోతుండడంతో టీడీపీ నాయకులు తల పట్టుకుంటున్నారు. చివరికి గూగుల్‌లో ‘ఏపీ పప్పు’ అని టైప్‌ చేస్తే లోకేష్‌ ఫొటోలు దర్శనమిస్తుండటం గమనార్హం.  

యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వీడియోలు  
సోషల్‌ మీడియా ర్యాగింగ్‌ను తట్టుకోలేక చినబాబుపై సెటైర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయించి పలువురిని అరెస్టులు కూడా చేయించినా వీటికి తెరపడటం లేదు. చివరికి పలు టీవీ ఛానళ్లు సైతం లోకేష్‌ మాటలపై కామెడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆయన కామెడీపై యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. మొత్తానికి మంత్రిగా ఆకట్టుకోలేకపోయినా కామెడీ పండిస్తూ జనానికి చినబాబు నవ్వు తెప్పిస్తున్నారు.      

రోడ్డెక్కిన నెటిజన్లు!
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై లోకేష్‌కు ట్విట్టర్‌లో ఫొటోలు 
స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ రోడ్లు అంటూ అనుకూల మీడియాలో మంత్రి నారా లోకేష్‌ చేసుకుంటున్న ప్రచారాన్ని నెటిజన్లు ట్విట్టర్‌ ద్వారా ఎండగడుతున్నారు. ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు, నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో 20,000 కి.మీ నిర్మించాం అంటున్న లోకేష్‌కు పలు గ్రామాల్లో తిరగడానికి కూడా వీల్లేని దుస్థితి నెలకొందంటూ ఫోటోలు, వీడియోల ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నారు. కొంతమంది మొబైల్‌ నెంబర్లు, పూర్తి సమాచారంతో పాటు ఆ ఊరి గూగుల్‌ మ్యాప్‌లను కూడా ట్వీట్‌ చేస్తుండటం గమనార్హం. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల ఫోటోలు ట్విట్టర్‌లో ప్రత్యక్షం కావడంతో.. ‘మీ సమస్యను నోట్‌ చేసుకున్నాం. సంబంధిత అధికారులకు చెప్పి పరిష్కరిస్తాం’ అంటూ అందరికీ ఒకే రకమైన సమాధానంతో లోకేష్‌ సరిపెడుతున్నారు.  

ఇలాగేనా రుణం తీర్చుకునేది? 
గత ఎన్నికల్లో 15కి 15 సీట్లు టీడీపికి కట్టబెట్టినందుకు మాపై చూపే కృతజ్ఞత ఇదేనా? అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు లోకేష్‌ను నిలదీస్తున్నారు. పదేళ్ల క్రితం పాడైన రోడ్డును ఇంత వరకు బాగు చేయలేదంటూ ప్రకాశం జిల్లా మార్టూరు మండలం జొన్నతాలికి చెందిన మురళీకృష్ణ నల్లూరి ట్వీట్‌ చేశారు. మూడు నెలల క్రితం ఇదే సమస్యను మంత్రి దృష్టికి తెచ్చినా పరిష్కారం కాకపోవడంతో మళ్లీ ట్వీట్‌ చేసినట్లు కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాపోయాడు.  

నీళ్లు దొరకడం లేదు సార్‌... 
సర్పంచుల కాలపరిమితి పూర్తయిన నాటి నుంచి తమ గ్రామంలో నీటి సరఫరా జరగడం లేదంటూ కృష్ణా జిల్లా పెనుగ్రంచిపోలుకు చెందిన పాయం శ్రీనివాసరెడ్డి మంత్రికి ట్వీట్‌ చేశారు. సాగర్‌కు 30 కి.మీ దూరంలో ఉన్నా తమ ఊళ్లో నీరు దొరకడం లేదంటూ గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చయల్లపాడుకు చెందిన మణి గుర్రాల వాపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement