
లోకేశ్‌ను ప్రశ్నిస్తున్న నాగేశ్వరరావును పక్కకు లాక్కెళుతున్న టీడీపీ నాయకులు
తాడేపల్లి రూరల్: టీడీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ తనను ప్రశ్నించిన ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉండవల్లి సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన లోకేశ్‌కు పోలకంపాడు, ఉండవల్లి దళితవాడ కరకట్ట వద్దకు వెళ్లే సరికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీరు అధికారం చేపడితే రాజధాని పేరుతో మా ఇళ్లు తొలగిస్తారని చెబుతున్నారు, నిజమా కాదా అంటూ’ మహిళలు నిలదీశారు. స్పందించిన లోకేశ్ మేం అక్కడ పట్టాలిచ్చాం, ఇక్కడ పట్టాలిచ్చాం అని చెబుతుండగా.. మీరున్న ఊళ్లో ఎందుకివ్వలేదంటూ మహిళలు ప్రశ్నించారు. అంతలో నాగేశ్వరరావు అనే చిరు వ్యాపారి ‘మీరు గెలిస్తే ఇళ్లు తీయరని గ్యారెంటీ ఏంటని’ అడిగారు.
రాబోయే ఐదు సంవత్సరాల్లో తాను ఎమ్మెల్యే అయితే ఒక్క ఇటుక కూడా కదిలియ్యనని లోకేశ్ అనడంతో, ఐదేళ్ల తర్వాత తీస్తారా అని అక్కడున్న వారు ప్రశ్నించారు. ఇది తట్టుకోలేని లోకేశ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ‘నేను చెప్పింది మీరు వినండి.. మీరు చెప్పేది నేను వినేదేంటి.. అర్థం చేసుకోరా అంటూ’ ఊగిపోయారు. దాంతో అక్కడున్న ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం గమనించిన టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న నాగేశ్వరరావుతో పాటు, మరికొంత మందిని పక్కకు నెట్టివేశారు.