
విలేకరులతో మాట్లాడుతోన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
సత్తెనపల్లి, నరసరావుపేటల్లో కోడెల కుటుంబం వల్ల ఎంతో మంది ..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై వైఎస్సార్‌సీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరులో శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..అవినీతి అరాచకాలకు కోడెల కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు. సత్తెనపల్లి, నరసరావుపేటల్లో కోడెల కుటుంబం వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆరోపించారు. స్పీకర్ వ్యవస్థనే భ్రష్టుపట్టించిన ఘనుడు కోడెలని విమర్శించారు.
23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. నలుగురు ఏకంగా మంత్రులుగా ప్రమాణం చేస్తుంటే ఏంచేశారని అడిగారు. ఇసుక లారీలను అర్ధరాత్రి రోడ్డు మీద ఆపేసి మీ సొంత అవసరాలకు వాడుకోలేదా అని ప్రశ్నించారు. చెప్పుకుంటూ పోతే కోడెల జీవితమంతా అరాచకమేనన్నారు. నిప్పునని చెప్పుకునే కోడెల కోటప్పకొండ మీద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు.