సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్లి కుంభమేళ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విశయం తెల్సిందే. ‘భారత దేశాధినేత (హెడ్ ఆఫ్ స్టేట్) కుంభమేళలో పాల్గొనడం ఇదే మొట్టమొదటి సారి’ అంటూ భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవియా ఓ ట్వీట్ చేశారు. ఆయనకు దేశాధినేతకు ప్రధాన మంత్రికి తేడా కూడా తెలియదనుకుంటా! దేశాధినేత అంటే భారత్‌కు రాష్ట్రపతే. 1953లోనే అప్పటి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ కుంభమేళలో పాల్గొన్నారు. ఆయన తర్వాత కుంభమేళలో పాల్గొన్న రెండో దేశాధినేతను తానేనంటూ దేశాధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీ సాయంత్రం స్వయంగా ట్వీట్ చేశారు.
పోనీ కుంభమేళలో పాల్గొన్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీని గుర్తించాలంటే అది నిజం కాదు. 1954లో తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కుంభమేళను సందర్శించి గంగా జలాన్ని నెత్తిన చల్లుకున్నారు. కుంభమేళ ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చేవి అయినప్పటికీ జవహర్ నెహ్రూ స్వయంగా కుంభమేళ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. ఈ విశయాన్ని కామా మాక్లీన్ అనే రచయిత్రి ‘పిలగ్రమేజ్ అండ్ పవర్: ది కుంభమేళా ఇన్ అలహాబాద్ 1765–1954’ అనే పుస్తకంలో ప్రస్థావించడమే కాకుండా గంగా జలాన్ని తల మీద చల్లుకుంటున్న నెహ్రూ ఫొటోను కూడా ప్రచురించారు.
ఆ తర్వాత 1977లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కూడా కుంభమేళలో పాల్గొన్నారు. ఆమె గంగలో ఉన్నప్పుడు తాను పక్కనే ఉన్నానని సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కాలమిస్ట్ తవ్లీన్ సింగ్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా కుంభమేళను సందర్శించినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. గంగా నదిలో మునిగి పవిత్ర స్నానం చేశారనడానికి సాక్ష్యాధారాలు కనిపించడం లేవు.
Comments
Please login to add a commentAdd a comment