
భువనేశ్వర్: ప్రభుత్వ సిబ్బందిలో అవినీతి ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవినీతికి పాల్పడిన 11 మంది ప్రభుత్వ సిబ్బందికి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టారు. వారిలో ఆరుగురిని విధుల నుంచి బహిష్కరించారు. మరో ఐదుగురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ నిలిపివేశారు. వీరందరికీ వ్యతిరేకంగా రాష్ట్ర విజిలెన్స్ విభాగం దాఖలు చేసిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు విజిలెన్స్ విభాగం నివేదికను కార్యాచరణలో పెట్టారు. అవినీతి ఆరోపణల ఆధారంతో ముగ్గురు ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (ఓఏఎస్), ఇద్దరు ఇంజినీర్ల పింఛన్ నిలిపివేశారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారుల్లో నవీన్ సేతు, సనాతన్ శెట్టి, పురంధర పూజారి ఉన్నారు. నిరంజన్ జెనా, పీతాంబర ప్రతిహారి ఇంజినీర్ల జాబితాలో ఉన్నారు. అవినీతి ఆరోపణలకు గురైన వారికి వ్యతిరేకంగా విచారణ, దర్యాప్తు 2 నెలల స్వల్ప వ్యవధిలో ముగించి ఇప్పటి వరకు 44 మంది ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల నుంచి బహిష్కరించారు. మరో 10 మందికి అనివార్య ఉద్యోగ విరామం మంజూరు చేశారు. 11 మంది విరామం పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పింఛన్ నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment