న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్న వేళ లోక్‌సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకు ఇకపై హోటళ్లలో తాత్కాలిక బసను కల్పించబోమని తెలిపింది. వెస్ట్రన్ కోర్టు, దానికి అనుబంధంగా నిర్మించిన నూతన భవనంతో పాటు స్టేట్ భవన్స్‌లో బసను ఏర్పాటుచేస్తామని చెప్పింది. ‘కొత్త ఎంపీలకు హోటళ్లలో బస కల్పించే సంప్రదాయానికి ముగింపు పలికాం’ అని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి స్నేహలత శ్రీవాస్తవ ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
గతంలో హోటల్ బసల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అనవసరమైన భారం పడుతోందన్న విమర్శలు గతంలో వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 300 మందికిపైగా ఎంపీలు కొత్తగా ఎన్నికయ్యారు. అయితే అప్పటివరకూ ఎంపీలుగా కొనసాగిన నేతలు అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో, నూతన ఎంపీలకు లోక్‌సభ కార్యాలయం హోటళ్లలో బసను ఏర్పాటుచేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.30 కోట్ల భారం పడింది. దీంతో విమర్శలు ఎదురుకావడంతో వెస్ట్రన్ కోర్టులో 88 బ్లాకులున్న భవనాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment