చేతులెత్తేసిన ప్రతిపక్షం  | No Opposition In The Rajya Sabha | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన ప్రతిపక్షం 

Published Thu, Aug 1 2019 1:58 PM | Last Updated on Thu, Aug 1 2019 1:59 PM

No Opposition In The Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆట ఆడకముందే ఓడిపోవడం అంటే ఇదే. రాజ్యసభలో ప్రతిపక్షం చేసిందీ ఇదే. వివాదాస్పదమైన ట్రిపుల్‌ తలాక్, ఆర్టీఐ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాయంటే ప్రతిపక్షం చేతులెత్తేయడమే అందుకు కారణం. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు కావాల్సినంత బలం రాజ్యసభలో ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ అలా జరగలేదు. అఖండ మెజారిటీతో తాము అధికారాన్ని చేపట్టినప్పటికీ రాజ్యసభలో మెజారిటీ కలిగిన ప్రతిపక్షాల వల్ల తమ బిల్లులన్నీ వీగిపోతున్నాయంటూ గతంలో ఆర్థిక మంత్రిగా అరుణ్‌ జైట్లీ మొత్తుకున్నట్లు ఇంకెవరు ఏడ్వాల్సిన అవసరం లేదు. 

చదవండిట్రిపుల్‌ తలాక్‌ ఇక రద్దు

వివాదాస్పదమైన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును గత లోక్‌సభ ఆమోదించినప్పటికీ రాజ్యసభ వ్యతిరేకించడంతో అది వీగిపోయింది. ఇంతకుముందు లోక్‌సభ, నేటి లోక్‌సభ నాటికి రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయితప్ప, ప్రతిపక్షం మెజారిటీ పెద్దగా పడిపోలేదు. అప్పటికీ ఇప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఈ వివాదాస్పద బిల్లును వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. ముస్లిం మహిళలకు మేలుకు ఉద్దేశించిన ఈ బిల్లు వల్ల కీడే ఎక్కువ జరుగుతుందన్నది ప్రతపక్షాల వాదన. ఈ బిల్లును గతవారం రాజ్యసభ 99–84 మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లులోని లోపాలను సవరించేందుకు ఎంపిక కమిటీ పంపించాలంటూ ప్రతిపక్షం ప్రవేశ పెట్టిన తీర్మానం 84–100 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఇక ఆర్టీఐ స్వయం ప్రతిపత్తిని సడలిస్తున్న సవరణ బిల్లు విషయంలోనూ ఇదే జరిగింది. ఎందుకు?

ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు వల్ల ఇది జరిగిందా? మరి వారెందుకు గైర్హాజరయ్యారు? ట్రిబుల్‌ తలాక్‌ బిల్లును రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు, ఆరుగురు సమాజ్‌వాది పార్టీ సభ్యులు, నలుగురు బహుజన్‌ సమాజ్‌ పార్టీ సభ్యులు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోపాటు మరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున, డీఎంకే, సీపీఎం, తణమూల్‌ కాంగ్రెస్‌ల నుంచి ఒక్కరేసి చొప్పున గైర్హాజరయ్యారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు నిజంగా అనారోగ్య కారణాల వల్ల సభకు హాజరుకాక పోవచ్చు. మరి, ఇంత మంది ఎందుకు గైర్హాజరయ్యారు. రెండోసారి మరింత బలంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఏం చేయలేమనే నిర్లిప్త భావం వారిని అలుముకుందా ? ప్రతిపక్షాల మధ్య సమన్వయం లోపించిందా ? నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలనే తపన వారిలో చచ్చి పోయిందా? లేదా అధికార పక్షం ప్రలోభాలకు వారు లొంగిపోయారా?

తలాక్‌ బిల్లు రాజ్యసభ ఆమోదానికి వచ్చినప్పుడు అది అవాంఛిత బిల్లని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ చీఫ్‌ ముఫ్తీ మెహబూబా విమర్శించారు. అయితే ఆ రోజు సభకు ఆమె పార్టీకి చెందిన ఇద్దరు సభ్యుల్లో ఒక్కరు కూడా హాజరుకాలేదు. అంటే తమ పార్టీ సభ్యులు హాజరైన అడ్డుకోలేరనా, అదే అయితే ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం కొరవడినట్లే. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే వ్యవహరిస్తూ వస్తోంది. 

ఆరోజు సభలో కూడా అదే వైఖరిని ప్రదర్శించింది. ఇతర పార్టీల సభ్యుల గైర్హాజరు పట్లనే అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల గైర్హాజరు కారణంగానే బిల్లులు ఆమోదం పొందినట్లు బీజేపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభలో కూడా ఇక ప్రతిపక్షం వీగిపోయినట్లే. పాలకపక్షం ఎలాంటి బిల్లులను తీసుకొచ్చినా చెల్లుబాటు కావడం తప్పదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement