
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించాక కూడా విపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం వల్లనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.