ఒడిశాలో ఎన్నికల ముందు సీన్‌ | Odisha Political Scene Before 2019 Elections | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 8:54 PM | Last Updated on Sat, Jun 9 2018 9:05 PM

Odisha Political Scene Before 2019 Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశానికి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఒడిశా రాష్ట్రానికి 2019లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలో 1997లో ఏర్పాటైన బిజూ జనతా దళ్‌ 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకు నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ ఇన్నేళ్లు వరుసగా రాష్ట్ర రాజకీయాలను శాసించడం విశేషం. అందుకు ఒడిశాకున్న భిన్నమైన లక్షణం. సంస్కృతే కారణం. ఇక్కడ కాంగ్రెస్‌ తరహా ఓట్ల రాజకీయాలకు, బీజేపీ తరహా హిందూత్వ రాజకీయాలకు ఆస్కారం లేదు. 

కుల, మతాల ప్రాతిపదికన ఒడిశా ప్రజలు విడిపోయి లేరు. వారంతా అభివృద్ధి అజెండా, మంచి పాలన ప్రాతిపదికన ఓటేస్తున్నారు. రాష్ట్రంలో 96 శాతం హిందువులు ఉన్నప్పటికీ హిందూత్వ రాజకీయాలకు ఇక్కడి ప్రజలు దూరంగా ఉన్నారు. వారిపై భిన్న సంస్కృతుల ప్రభావం కనిపిస్తున్నది. ఖండాయత్‌ సామాజిక వర్గం బలమైనప్పటికీ రాజకీయాల్లో వారి పాత్ర తక్కువే. దాదాపు 40 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు ఉన్నప్పటికీ ఓటింగ్‌ సరళి కులాల ప్రాతిపదికన సాగినట్లు కనిపించదు. బ్రాహ్మణులు, కరణాలు రాష్ట్రంలో తక్కువే ఉన్నప్పటికీ గత 70 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో వారి ప్రభావం కనిపిస్తోంది. అంటే ఒక విధంగా అర్ధ భూస్వామ్య వ్యవస్థ ప్రభావం కనిపిస్తోంది. 

మతాల ప్రాతిపదిక ప్రజలను రాజకీయంగా సమీకరించేందుకు ఇక్కడ అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. గతేడాది జరిగిన భద్రక్‌ హింసాకాండే అందుకు ఉదాహరణ. ముఖ్యంగా ఓ పార్టీ మతం ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అంతే బలంగా ఆ రాజకీయాలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. మత రాజకీయాలకన్నా అభివృద్ధినే ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నందున ఒడిశా ప్రజలు సామరస్య జీవనానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కంధమాల్‌ హింసాకాండ కూడా అలాంటిదే. కుల, మతాల ప్రాతిపదికన అక్కడ ప్రజల సమీకరణకు బలమైన ప్రయత్నాలు జరిగాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ బీజేపీ అందుకే లాభ పడింది. అయితే అన్ని ప్రాంతాల్లో అలా జరగలేదు. 

రాజకీయ, ఆర్థిక అభివృద్ధి ఎజెండానే నమ్ముకున్నందున ఇంతకాలం బీజేడి అధికారంలో కొనసాగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఎజెండా కాబోతోందా? అదే విజయాన్ని అందిస్తోందా? అసలు బీజేడీ హయాంలో అభివృద్ధి ఎంత జరిగింది ? మరే ఇతర అంశాలు రానున్న ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి? ఇతర పార్టీల వైఖరీ, ఎజెండాలేమిటీ? ప్రజలు ఎవరి గురించి ఏం అనుకుంటున్నారు? మొత్తంగా ఏ అంశాలు ఓటింగ్‌ రాజకీయాలను శాసిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పీపుల్స్‌ పల్స్‌ రాజకీయ, సామాజిక అధ్యయన, పరిశోధన సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల కిలోమీటర్లు ప్రయాణించి వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను, దృక్పథాలను నేరుగా అడిగి తెలుసుకుంది. విద్యావేత్తలను, యూనివర్శిటీ ప్రొఫెసర్ల అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకుంది. 

నవీన్‌ పట్నాయక్‌కు కలసివచ్చే అంశాలు...ప్రతికూలించే అంశాలు
1. రూపాయికి కిలోబియ్యం, ఐదు రూపాయలకు ఆహార పథకం. విద్యార్థినులకు సైకిళ్లు,  ఉచిత గొడుగులు. స్వయం ఉపాధి బృందాలకు రుణాలపై వడ్డీ మాఫీ, ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు. తమళపాకుల వ్యాపారంలో వాటిని ఏరే వారికి వాటా. 
2. ముఖ్యమంత్రిగా నాయకత్వ లక్షణాలు. ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు కనిపించడం లేదు. 
3. సుదీర్ఘకాలంగా ప్రభుత్వంలో ఉన్నందున బీజేడీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రభుత్వం వ్యతిరేకత కనిపిస్తోంది.
4. యువతలో నిరుద్యోగ సమస్య. ధరల పెరుగుదల
5. భూ కుంభకోణాలు, మైనింగ్‌ స్కాములు, చిట్‌ఫండ్‌ స్కాములున్నా అవి పట్నాయక్‌ ప్రభుత్వంపై ప్రభావం చూపించడం లేదు. 
6. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ ఉత్సాహంగా ఉంది. చాలా చోట్ల అధికార బీజేడీకి గట్టిపోటీ బీజేపీయే కానుంది. 
7. ఆందోళనకరమైన పరిస్థితి కాంగ్రెస్‌దే. ప్రధాన పోటీ బీజేడీతో కాకుండా ప్రతిపక్ష పార్టీ హోదా కోసం బీజేపీతోనే కాంగ్రెస్‌ పార్టీ పోడాల్సి వస్తోంది. 
8. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు ఎవరు కారణం అన్న ప్రశ్నకు 60 శాతం మంది ప్రజలు కేంద్రం అని, 40 శాతం మంది ప్రజలు రాష్ట్రమని సమాధానమిచ్చారు. 
9. మహానది జలాల సమస్య. వ్యవసాయ సంక్షోభం. 
10. ఆందోళనలో రైతులు. విత్తనాలు, ఎరువుల ధరలు ఎక్కువ. గిట్టుబాటు ధర తక్కువ. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యాలు మృగ్యం. కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కొందరు వలసపోతున్నారు. 
11. కొన్ని ప్రాంతాల్లో మంచినీటికి, వ్యవసాయానికి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 
12. గ్రామాలకు కలిపే లింకు రోడ్డు సరిగ్గా  లేవు. చాలా ప్రాంతాల్లో ఆరోగ్య సౌకర్యాలు అంతంత మాత్రమే. 
13. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత. ప్రభుత్వ దిగువ స్థాయిలో అవినీతి ఎక్కువగా ఉంది. పోలీసు స్టేషన్లు, ఆస్పత్రుల్లో కూడా చేయి తడిపితేగానీ పనులు కావడం లేదు. 
14. పెద్ద స్కామ్‌ల ప్రభావం పెద్దగా లేకపోయినా స్థానికంగా అవినీతిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 
15. హిందూత్వ ప్రభావం లేదు. 
16. తెలంగాణలాగా కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ వాదం కనిపించినా అంత బలంగా లేదు. కోస్తా నుంచి వేరన్న భావన పశ్చిమ ప్రాంతంలో లేదు. అయినప్పటికీ ప్రాంతీయ వాదాన్ని, అటు ఓబీసీల అభివృద్ధి ఎజెండాతో బీజేపీ లాభ పడాలని చూస్తోంది. 
17. అగ్రవర్ణాలు, ఓబీసీల మద్దతు ఎక్కువగా పాలకపక్ష బీజేడీకే ఉంది. కాంగ్రెస్‌కు దళితులు, ఆదివాసీలు, క్రైస్తవుల మద్దతు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేడీకి గట్టి పునాదులుండగా, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోంది. 
18. కాంగ్రెస్‌కు స్థానిక నాయకుల కొరత ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
19. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను ముందుకు తీసుకొచ్చింది. 
20. పంచాయతీ  ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ, బీజేడీకి గట్టిపోటీ ఇవ్వనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement