సాక్షి, బెంగళూరు(బెళగావి): అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉత్తర కర్ణాటక శైలి ఆహారం వల్ల అస్వస్థతకు గురవడంపై మంగళవారం విధానసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఉదయమే బీజేపీ సభ్యుడు సోమణ్ణ మాట్లాడుతూ.. ఈసారి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని, గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని ఆరోపించారు. తామూ ఉత్తర కర్ణాటక శైలి ఆహారాన్ని ఎన్నోసార్లు తిన్నామని, ఈసారి అత్యంత నాసిరకంగా ఉండడంతోనే ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అస్వస్థతకు గురయ్యారన్నారు. అందుకు సభాపతులే కారణమంటూ ఆరోపించారు. ఒక్క ప్లేటు భోజనానికి రూ.500 ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారని అయితే ఈ భోజనం చూస్తుంటే కనీసం రూ.50 విలువ కూడా చేసేలా లేదన్నారు.
శాసనసభ్యుడు శాణప్ప కూడా సోమణ్ణకు మద్దతుగా మాట్లాడారు. ఇక్కడ ఒక్కసారి భోజనం తింటే కనీసం 12సార్లు వాంతులు అవుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలెవరూ శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదనే కుట్రతోనే ఇటువంటి భోజనాలకు ఆర్డర్‌ను అందించారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వీరి ఆరోపణలకు కాంగ్రెస్ సభ్యుడు పాటిల్ స్పందిస్తూ.. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం చర్చలు జరగాల్సిన సమావేశాల్లో ఆహారం గురించి చర్చించుకోవడం సబబు కాదన్నారు. అందుకు మిగిలిన కాంగ్రెస్ సభ్యులు కూడా శృతి కలపడంతో అధికార,ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది.
Comments
Please login to add a commentAdd a comment