అలాగైతే ప్రలోభాలకు గురిచేస్తారు: ఉత్తమ్‌ | Opposition Parties In Telangana Met State Election Commission In Hyderabad | Sakshi
Sakshi News home page

అలాగైతే ప్రలోభాలకు గురిచేస్తారు: ఉత్తమ్‌

Published Fri, May 17 2019 5:49 PM | Last Updated on Fri, May 17 2019 5:50 PM

Opposition Parties In Telangana Met State Election Commission In Hyderabad - Sakshi

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అఖిల పక్ష నేతలు

హైదరాబాద్‌: జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్‌ల ఎంపిక విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, జనసమితి, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈసీని కలిసిన అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్‌ ఎంపికకు 40 రోజుల గడువు పెడితే అధికార పార్టీ ప్రలోభాలకు  గురిచేస్తుందని, అలా చేయవద్దని కోరినట్లు చెప్పారు.

ఫలితాలు వచ్చిన 3 రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక జరిగేటట్లు చూడాలని కోరామన్నారు. బ్లాక్‌ మనీ, పోలీసులను ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను అప్రజాస్వామిక పద్ధతిలో ఇదివరకే చేర్చుకున్నారని ఆరోపించారు. మే 27న కౌంటింగ్‌ చేసి 3 రోజుల్లో చైర్మన్‌ల ఎంపిక చేసి జూలై5 తర్వాత ఛార్జ్‌ తీసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు వెల్లడించారు. 

చట్టాలంటే కేసీఆర్‌కు గౌరవం లేదు: ఎల్‌ రమణ(టీటీడీపీ అధ్యక్షులు)
చట్టాల పట్ల కేసీఆర్‌కు గౌరవం లేదని టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌ రమణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, చైర్మన్‌ల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఫలితాల తర్వాత చైర్మన్‌ల ఎంపికకు ఎక్కువ సమయం ఇవ్వడం వల్ల 538 ఎంపీపీలు, 28 జెడ్పీ చైర్మన్‌లు టీఆర్‌ఎస్సే గెలిచే అవకాశం ఉంటుందన్నారు.

ప్రజాస్వామ్యం కూనీ: షబ్బీర్‌ అలీ

కేసీఆర్‌ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తున్నారని మాజీ మంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తిగా కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement