ఢిల్లీలో వ్యాపారుల సమావేశంలో మోదీ
న్యూఢిల్లీ: వ్యాపారులందరూ దొంగలేనని కాంగ్రెస్ పార్టీ అంటోందనీ, గత 70 ఏళ్ల ఆ పార్టీ పాలనలో వ్యాపారులకు అన్నీ అవమానాలే ఎదురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ధరలు పెరగడానికి వర్తకులే కారణమని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరోపించేవనీ, అయితే వాస్తవానికి ఆ పార్టీ మనుషులే వస్తువులను నల్లబజారుకు తరలించి ధరలు పెరిగేలా చేసేవారని మోదీ నిందించారు. ఢిల్లీలో పలువురు వ్యాపారులతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘వ్యాపారులను దొంగలు అంటూ కాంగ్రెస్ దుర్భాషలాడుతోంది. కానీ జాతిపిత మహాత్మా గాంధీ తాను వ్యాపారుల కులమైన బనియాకు చెందిన వాడినని గర్వంగా చెప్పేవారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు వెన్నెముక. కానీ గతంలో వారికి లభించాల్సిన గౌరవం ఎన్నడూ దక్కలేదు. కష్టకాలంలో వ్యాపారులకు బాసటగా నిలిచింది బీజేపీ ప్రభుత్వమే’ అని అన్నారు.
తనఖా లేకుండానే 50 లక్షల రుణం
మళ్లీ ఎన్డీయే అధికారం చేపడితే వ్యాపారులకు ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50 లక్షల వరకు రుణాలిస్తామనీ, జీఎస్టీ వ్యవస్థలో నమోదైన సంస్థలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని మోదీ తెలిపారు. వ్యాపారులకు క్రెడిట్ కార్డు సౌకర్యం కల్పించడం, చిన్న దుకాణాలు నడుపుకునే వ్యక్తులకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు కొత్త చిల్లర వర్తక విధానాన్ని తెస్తామని మోదీ ప్రకటించారు. అలాగే జాతీయ వ్యాపారుల సంక్షేమ మండలిని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో భారత్ తమ ప్రభుత్వ కాలంలో 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ ర్యాంకు పొందిన విషయాన్ని మోదీ గర్తుచేశారు.
స్టార్టప్‌ల్లో 20 వేల కోట్లు పెడతాం..
తమ ఐదేళ్ల పదవీ కాలంలో పురాతన కాలం నాటి 1,500 చట్టాలను రద్దుచేసి వ్యాపారుల జీవితాలను, పనులను సరళతరం చేశామని మోదీ చెప్పారు. ‘వ్యాపారులు దోహదం చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చగలిగాం. వ్యాపారుల శ్రమ నన్ను ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థ వికసించడానికి వారు సాయపడ్డారు’ అని మోదీ పేర్కొన్నారు. తమ పార్టీ గెలిస్తే యువతను వ్యాపారం వైపు ఆకర్షించేందుకు రూ. 20,000 కోట్లను స్టార్టప్ రంగంలో పెట్టుబడులుగా పెడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment