మెతుకుసీమగా పేరొందిన మెదక్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడ గెలుపుపై గురిపెట్టారు. కూటమిలో లుకలుకలు, టీజేఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ తొలి శాసనసభ సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టిన ఆమెకు నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. మహిళా ఎమ్మెల్యేగా ఆమెకు కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనం.
ఇక తాను చేపట్టిన పనులు, టీఆర్‌ఎస్‌కున్న బలమైన కేడర్, ప్రత్యర్థుల బలహీనతలే తన బలంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నియోకజవర్గం పరిధిలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. మరోసారి తనను గెలిపిస్తే మెదక్ రూపురేఖలు మారుస్తానని ఆమె ప్రజలకు హామీ ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి సీటు ముందే ఖరారు కావడంతో ఆమె రెండు నెలల ముందునుంచే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి ఎవరనే విషయంలో కొంత స్పష్టత లోపించింది. మొదట ఈ స్థానాన్ని మహా కూటమి తరపున టీజేఎస్‌కు కేటాయించారు. టీజేఎస్ తరపున చిన్నశంకరం పేటకు చెందిన జనార్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పాపన్నపేటకు చెందిన ఉపేందర్‌రెడ్డికి కూడా బీ ఫాం ఇచ్చింది. దీంతో ఆయన కూడా నామినేషవేశారు.
సిట్టింగ్ ప్రొఫైల్
రామాయంపేట మండలం కోనాపూర్‌కు చెందిన మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. బీఏ ఎల్‌ఎల్‌బీ చదివిన ఆమె 2001లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 2001 నుంచి 2004 వరకు రామాయంపేట జెడ్పీటీసీగా పనిచేశారు. 2004లో మొదటి సారిగా రామాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓడారు. 2009లో మెదక్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి తిరిగి ఓటమి చవిచూశారు. 2014లో విజయశాంతిపై పోటీచేసి 39,600 మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ తొలి శాసన సభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు.
Segment Graph
ప్రత్యేకతలు
- పంచాయతీరాజ్ ద్వారా రూ.156 కోట్లతో రహదారుల నిర్మాణం
- మెదక్ పట్టణానికి రూ.880 కోట్లతో రింగ్‌రోడ్డు
- రూ.38 కోట్లతో సమీకృత కలెక్టరేట్, రూ.18 కోట్లతో పోలీసు కార్యాలయం భవనాలు నిర్మాణం
- రైతుల కోసం మండలానికి ఒక గోదాము నిర్మించారు.
- మెదక్ పట్టణంలో 300 పడకల ఆసుపత్రి
- వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.
- మెదక్ పట్టణంలో మినీట్యాంక్‌బండ్, బ్యూటిఫికేషన్
- రైతు బంధు ద్వారా 59,835 మందికి లబ్ది చేకూరింది.
- సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 2329 మంది సహాయం.
ప్రధాన సమస్యలు
- వ్యవసాయ ప్రధానమైన మెదక్‌లో సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి.
- చెరుకు రైతులకు ఉపయోగపడే ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీని తెరిపించాల్సి ఉంది.
- ఘనపురం ప్రాజెక్టు పనులు పెండింగ్.
- పీజీ, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యా సంస్థలు లేవు. యువత ఉపాధి సమస్య ఎదుర్కొంటోంది.
.:: ఇన్‌పుట్స్: నాగరాజు కాకోళ్ల, మెదక్
Comments
Please login to add a commentAdd a comment