హరీష్‌రెడ్డి ,మన్నె గోవర్ధన్‌రెడ్డి , నవీన్‌యాదవ్ ,నక్కా ప్రభాకర్‌గౌడ్
సాక్షి,సిటీబ్యూరో: గత ఎన్నికల్లో వారు ఓటమి చెందినా వారివారి పార్టీలను వీడలేదు. ఈ నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానాలు తమకు తప్పకుండా టికెట్ ఇస్తాయని ఆశించారు. కానీ కారణాలు ఏమైనా అనుకున్నది జరగలేదు. టికెట్ల పంపకాల్లో వారిని పక్కన పెట్టారు. దీంతో కలత చెంది తిరుగుబావుటాలు ఎగరేసి నగరంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. తాము ఆశించిన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి కొందరు, స్వత్యంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తమ బలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని బూత్ స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే, ఈసారి అధికంగా టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ వారే రెబల్స్‌గా పోటీలో ఉండడంతో తమ ఓటు బ్యాంక్‌కు ఏ రూపంలో గండి పడుతుందోనన్న భయం అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.
జూబ్లీహిల్స్‌లో నవీన్ స్వతంత్ర బావుటా
గడిచిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. అయితే, ఈసారి ఆయనకు ఎంఐఎం టికెట్ నిరాకరించింది. స్థానికంగా బలమైన కేడర్ గల నవీన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో బూత్ ల వారిగా ఇప్పటికే కమిటీలను నియమించుకుని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సహజంగా ఎంఐఎం–టీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న సఖ్యత నవీన్‌యాదవ్ పోటీతో చెడిపోయింది. దీంతో మైనారిటీ ఓట్లపై టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా పనిచేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి కూడా టికెట్ తనకే ఇస్తారని ఆశించినా నెరవేరలేదు. దీంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య కవిత వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్‌గా కూడా పనిచేస్తుండడం, ఆయనపై సాను భూతి వ్యక్తం ఉండడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
కూకట్‌పల్లిలో హరీష్‌రెడ్డి
టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ పన్నాల హరీష్‌రెడ్డి కూకట్‌పల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హరీష్ సతీమణి బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య సైతం విస్తృతంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా హరీష్ నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. బూత్‌స్థాయిలో విస్తృతమైన అనుచరగణాన్ని తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. హరీష్ టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు సైతం భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలోనూ మాజీ టీఆర్‌ఎస్ నాయకుడు నక్కా ప్రభాకర్‌గౌడ్ ప్రధాన పార్టీలకు గట్టి సవాల్‌నే విసురుతున్నారు. ఆయనకు టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలను మించి ర్యాలీలు నిర్వహిస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment