లబ్ధిదారులకు చెక్కును అందజేస్తున్న జస్టిస్ శ్యామ్ కోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు.
హైకోర్టులో 404 కేసులు..
హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment