నేటి రాజకీయాల్లో సామాజిక దృక్పథమేదీ? | Govardhan Reddy Exclusive Interview with Sakshi In the wake of the election | Sakshi
Sakshi News home page

నేటి రాజకీయాల్లో సామాజిక దృక్పథమేదీ?

Published Tue, Nov 14 2023 2:03 AM | Last Updated on Tue, Nov 14 2023 11:12 AM

Govardhan Reddy Exclusive Interview with Sakshi In the wake of the election

పార్టీ టికెట్‌ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు ముడిపడటంతో పోటీచేసే వారిలో సామాజిక కోణం, సేవాదృక్పథం లోపిస్తోంది. రియల్‌ వ్యాపారులు, పెద్దఎత్తున భూములు కబ్జా చేసినవారు, ఇతర వ్యాపారాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేసే వారి వద్ద అడ్డగోలుగా అక్రమ సంపాదన పెరిగి రాజకీయాల్లోకి వస్తుండటంతో ఎన్నికల్లో మామూలు వ్యక్తులు, సేవా దృక్పథం ఉన్నవారు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని  ప్రముఖ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ కె.గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కె.గోవర్ద్ధన్‌రెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు. 

1985 ఎన్నికల్లో రూ.లక్షన్నర ఖర్చుతో పోటీచేశా.. 
నేను ఓ డాక్టర్‌గా, ఓ సామాజిక కార్యకర్తగా దరఖాస్తు చేసుకుంటే.. 1985లో మలక్‌పేట నుంచి పోటీచేసేందుకు అప్పటి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.లక్షన్నర (పార్టీ ఇచ్చిన రూ.50 వేలు కలిపి). అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు, బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డితో పోటీపడి ఓటమి చవిచూశాను. ఆంధప్రదేశ్‌ ఫ్లోరోసిస్‌ విమోచన సమితి అధ్యక్షుడిగా, వివిధ సామాజిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేశాను.  

సాగర్‌లో అణువిద్యుత్‌ కేంద్రం వద్దని రాజీవ్‌ని కోరాను.. 
నాగార్జునసాగర్‌లో అణువిద్యుత్‌ కేంద్రం పెడతారని ప్రచారం కావడంతో వెంటనే స్పందించాను. అప్పటి నల్లగొండ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్లోరోసిస్‌ సమస్య ఉన్నందున ఈ కేంద్రం పెడితే పర్యవసానాలు వివరిస్తూ  దీనిని విరమించుకోవాలంటూ, నేరుగా ప్రధాని రాజీవ్‌గాంధీ కార్యాలయానికి లేఖ రాశాను. రెండువారాల్లోనే ప్రధాని సెక్రటరీ దూబే నుంచి ఆ లేఖ అందినట్టుగా జవాబు వచ్చింది. మూడునెలల తర్వాత ముంబైలోని అణు విద్యుత్‌ విభాగం డైరెక్టర్‌  విజయ మనోరమ నుంచి మరో వివరణ లేఖ (పీఎంఓ నుంచి నా వినతిపత్రం కాపీ వారికి అందాక) వచ్చింది. సమీప భవిష్యత్‌లో ఈ కేంద్రాన్ని పెట్టే ఉద్దేశం లేదని, పెట్టదలిస్తే అందరి అభిప్రాయాలు తీసుకుని, పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాకే దానిని చేపడతామని స్పష్టం చేశారు. 

ఉమ్మడి ఏపీలో తొలి ప్రజాప్రయోజన వ్యాజ్యం నాదే...
1991లో సిరీస్‌ ఇండస్ట్రీ కారణంగా భూగర్భజలాలు కలుషితం కావడంపై ఉమ్మడి ఏపీ హైకోర్టులో నేను మొట్టమొదటి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాను. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ భగవతి సూచనలు జారీచేసిన మూడు నెలల్లోనే సీనియర్‌ న్యాయవాది, పీయూసీఎల్‌ నేత ప్రతాపరెడ్డి ద్వారా పిల్‌ దాఖలు చేశాను. కేసు జస్టిస్‌ రామాంజనేయులునాయుడు బెంచ్‌కు వెళ్లగా  24 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు మంచినీటిని పంపిణీ చేసేలా సిరీస్‌ సంస్థ ద్వారా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టారు. ఎఫ్లూయెంట్స్‌ను ట్రీట్‌ చేసి బయటకు పంపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటం... 
రేడియాలజిస్ట్‌గా మొదటి ప్రైవేట్‌ క్లినిక్‌ పెట్టాక...నల్లగొండ నుంచి నాగార్జునసాగర్‌ దాకా ఎక్స్‌రే యూనిట్లే లేకపోవడంతో కాళ్లు వంకర అని, నడవలేకపోతున్నామని నా దగ్గరకు చాలా మంది వచ్చేవారు. అన్నిఎక్స్‌రేలలో తెల్లటి చారలు కనిపించడంతో దానిపై పరిశోధన జరిపితే ఫ్లోరోసిస్‌ జబ్బు అని తేలింది. ఎముకల్లో ఫ్లోరిన్‌ జమ కావడంతో ఈ జబ్బుకు కారణమని స్పష్టమైంది. ఇతరులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఫ్లోరోసిస్‌ విమోచన సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టాను.

30 ఏళ్లకే ముసలితనం అనే వీడియోను చిత్రీకరించి ఫ్లోరోసిస్‌పై విస్తృత ప్రచారం చేశాము. సాగర్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే కృష్ణా జలాల్లో మార్గ మధ్యలో ఉన్న ఫ్లోరోసిస్‌ ప్రభావిత దాదాపు 150 గ్రామాలకు (శివన్నగూడెం దాకా) నీరు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఏఎంఆర్‌ ప్రాజెక్ట్‌ వచ్చాక ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు కట్టి ఇచ్చారు. మిషన్‌ భగీరథ రావడంతో ఈ సమస్య దాదాపుగా తగ్గిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement