‘పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు. నల్లగొండను కేసీఆర్ దత్తత తీసుకుని ఒక్క రోడ్డు వేసి ఇంకా దత్తత అయిపోలేదని మాయమాటలు చెబుతుండు. ఆ మాటలు నమ్మితే మళ్లీ మోసపోతాం. బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. నన్ను గెలిపిస్తే మీ సేవకుడిగా పని చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అందరి కష్టాలు తీరుస్తాం. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేయడంతోపాటు పేదలకు ఇళ్లు నిర్మిస్తాం’ అని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. –నల్లగొండ
అధికారంలోకి వస్తాం.. అందరి కష్టాలు తీరుస్తాం
నల్లగొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఎంతో ఆదరించి 20 ఏళ్లు ఆశీర్వదించారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. గత ఎన్నికల్లో కేసీఆర్ దత్తత పేరుతో మాయమాటలు చెబితే ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ, నల్లగొండలో ఐదేళ్లలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వల్ల జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు.
నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడే నల్లగొండ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశాను. అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ను ఒప్పించి శ్రీశైలం సొరంగ మార్గం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టులను మంజూరు చేయించాను. 250 ఎకరాల్లో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్మించా. పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రైల్వే ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మించాను. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప నల్లగొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదు.
ప్రస్తుత ఎమ్మెల్యే కేసీఆర్‌లా నియంతలా వ్యవహరిస్తూ తొక్కి చంపుతా అని బెదిరిస్తున్నారు. అంతేకాదు భూకబ్జాలు, అక్రమ దందాలు పెరిగిపోయాయి. నాకు అవకాశం ఇవ్వండి. నల్లగొండలో రౌడీయిజం లేకుండా చేస్తా. శత్రువును ప్రేమించే గుణం నాది. నా కొడుకు పేరున ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద వారిని ఆదుకుంటున్నా. మీ పిల్లల్లో నా కొడుకును చూసుకుంటా.
నా కూతురు పెళ్లి అయిపోయింది. నాకు మీ సేవ తప్ప మరొకటి లేదు. నల్లగొండలోనే ఉంటా. మీతో బతకాలని వచ్చా. మరోసారి ఆశీర్వదించండి. నాతోపాటు ఎన్నికల్లో నా భార్య, కూతురు మీ వద్దకు ఓటు అడగడానికి వచ్చారు. సమయభావం వల్ల కొందర్ని కలువలేకపోయా. 30వ తేదీన చేయి గుర్తుపై ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలి.
ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం..
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇస్తుంది. గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు మిగతా ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తాం. విద్య వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల ఇస్తాం.
నల్లగొండలో ఐటీ పార్కు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. పాటు ఇళ్లు లేని వారికి ఇల్లు, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు మంజూరు చేస్తాం. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దీనికి కారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతకాని తనమే. మాయ మాటలు నమ్మి బీఆర్‌ఎస్‌కు ఓటేసే గోస పడతాం. విజ్ఞులైన ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటేయాలి.
కేసీఆర్‌ది దొంగ దీక్ష
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసింది దొంగ దీక్ష, ఆస్పత్రిలో మెడిసన్ తీసుకుని ఆయన దీక్ష చేశారు. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. మణిపూర్‌లో ఒక మహిళ 13 ఏళ్లు మెడిసన్ తీసుకుని దీక్ష చేసింది. విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సాధించినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఏ మేలూ జరగలేదు. రైతు బంధు అమెరికాలో ఉన్న వారికి ఇస్తుంది. మంత్రి మల్లారెడ్డి కూడా తీసుకుంటున్నాడు. కేసీఆర్‌ది అంతా ఉన్న వారిని దోచి పెట్టడమే.
Comments
Please login to add a commentAdd a comment