
వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ హేమాహేమీలైన నేతలు బరిలో నిలిచి గెలుపొందడమే కాకుండా...మంత్రి పదవులు చేపట్టారు. అందుకే దీన్ని మంత్రుల సీటుగా చెప్పొచ్చు. 20014లో ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ తరపున గెలిచిన పట్నం మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించగా...అంతకు ముందు ఇక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచిన మర్రి చెన్నారెడ్డి, మాణిక్‌రావు, చంద్రశేఖర్‌రావులు కూడా మంత్రులుగా పనిచేశారు. 2004లో గెలిచిన నారాయణరావుకు కూడా మంత్రి పదవి ఛాన్స్ లభించినా..కొన్ని కారణాల వల్ల ఆయనకు చివరి నిమిషంలో పదవి దక్క లేదు. మొత్తమ్మీద తాండూరు నుంచి గెలిచిన ఎక్కువ మంది మంత్రి పదవి చేపడతుండడం గమనార్హం. ఇక వ్యవసాయ, వాణిజ్యపరంగా తాండూరు నియోజకవర్గం మంచి ప్రగతి సాధించింది.
ఈ ప్రాంతంలో కంది సాగు ప్రత్యేకత కలిగి ఉంది. నాపరాయి, సుద్ద, లాటరైట్ వంటి ఖనిజాలకూ తాండూరు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ సారి బరిలో టీఆర్‌ఎస్ తరుపున మరోసారి పట్నం మహేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన నాలుగున్నరేళ్ల కాలంలో తాండూరు నియోజకవర్గానికి రూ.1800 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాధించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తనకున్న ప్రాబల్యం, చేపట్టిన పనులు ఈసారి ఎన్నికల్లోనూ గెలిపిస్తాయని మహేందర్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి బషీరాబాద్ మండలానికి చెందిన పైలట్ రోహిత్‌రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. ఈయన మొదటిసారి తాండూరు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలతో ముందుకు సాగుతున్నారు. స్థానిక నేతల సహకారంతో ప్రచారం చేపట్టారు. తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. మొత్తానికి తాండూరు నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
సిట్టింగ్ ప్రొఫైల్..
పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ మూడు దశాబ్దాల పాటు గెలుస్తూ వస్తున్న మహరాజుల కుటుంబ సభ్యులను ఓడించి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. గతంలో స్థానికేతరుడని ముద్ర ఉంది. అయితే తరచు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉండి చేరువయ్యారు. తిరిగి 1999, 2009లలో టీడీపీ తరపునే విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ తరుపునా ఆయన తిరిగి విజయం సాధించి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. 2004లో మాత్రమే ఒకసారి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఇదే స్థానం నుంచి 6వ సారి పోటీకి దిగుతున్నారు.
ప్రధాన సమస్యలు
- తాండూరులో నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఉపాధి లభించడం లేదు. దీనిపై ఇక్కడి యువత కొంత అసంతృప్తిగా ఉన్నారు.
- తాండూరు పట్టణంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. ఇవి ఏర్పాటైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుంది.
- తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
- గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కొన్నిచోట్ల అధ్వానంగా ఉన్నాయి.
ప్రత్యేకతలు
- తాండూరులో గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఐటీఐ కళాశాల మంజూరు నిరుపేద విద్యార్థులకు ఎంతో మేలు చేసింది.
- రైతు బజార్ , సోలార్ విద్యుత్ కేంద్రం నిర్మాణం
- తాండూరు మున్సిపల్ పరిధిలో రోడ్ల విస్తరణ వంటి ముఖ్యమైన అభివృద్ధి పనులు మహేందర్‌రెడ్డి హయాంలో పూర్తయ్యాయి.
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా 4448 మంది లబ్ధిదారులకు రూ.14 కోట్ల నిధులు అందించారు.
- సీఎం సహాయ నిధి ద్వారా వివిధ చికిత్సల కోసం 1,113 మందికి రూ.6.60 కోట్ల వరకు ఆర్థిక సాయం చేశారు.
- మిషన్ కాకతీయ పథకం ద్వారా 198 చెరువులను బాగు చేసేందుకు రూ.74 కోట్ల మంజూరు.
- తాండూరు బైపాస్ రోడ్డుకు రూ.78కోట్ల నిధులు మంజూరు.
- పంచాయతీరాజ్ నిధుల ద్వారా 1987 అభివృద్ధి పనులకు గాను రూ.185 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.
- ఇందర్‌చెడ్, నవాంద్గి ఎత్తిపోతల పథకాల అభివృద్ధికి రూ.1.82 కోట్ల నిధులు మంజూరు. పనులు కొనసాగుతున్నాయి.
- మిషన్ భగీరథ ద్వారా 185 గ్రామాలకు రూ.350 కోట్ల నిధులతో 3.24 లక్షల మందికి ఇంటింటికీ తాగునీరు.
- రైతు బంధు పథకం ద్వారా 54,115 మంది రైతులకు రూ.65,18 కోట్ల వరకు పెట్టుబడి సాయం
.::: ఇన్‌పుట్స్: కరణం భీంసేన్ రావు, తాండూరు
Comments
Please login to add a commentAdd a comment