‘పట్నం’కే పట్టం | Patnam Mahender Reddy Won MLC Election | Sakshi
Sakshi News home page

‘పట్నం’కే పట్టం

Published Tue, Jun 4 2019 9:05 AM | Last Updated on Tue, Jun 4 2019 9:05 AM

Patnam Mahender Reddy Won MLC Election - Sakshi

నియామకపత్రం అందుకుంటున్న మహేందర్‌రెడ్డి.

స్సాక్షి, రంగారెడ్డి జిల్లా :థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలైన 797 ఓట్లలో మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు దక్కగా.. ప్రతాప్‌రెడ్డికి 266 ఓట్లు లభించాయి.  ఓట్ల లెక్కింపు రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలోనే దాదాపుగా మహేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. అభ్యర్థి వారీగా బ్యాలెట్‌ పేపర్లు బిండల్‌గా కడుతున్న సమయంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటమి సంకేతాలు కనిపించాయి. ఉదయం 11 గంటలకు మహేందర్‌రెడ్డి విజయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. తొలిప్రాధాన్యత ఓటుతోనే ఆయనకు విజయం దక్కింది. దాదాపు సగం ఓట్ల తేడాతో గెలుపొందడంతో గులాబీ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. సిట్టింగ్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ తిరిగి కైవసం చేసుకోవడం విశేషం.

క్రాస్‌ ఓటింగ్‌
ఆరు వందలకుపైగా ఓట్లు లభిస్తాయని టీఆర్‌ఎస్‌ మొదటి నుంచి ధీమాతో ఉంది. ఈ పార్టీ నిర్వహించిన శిబిరాల్లో 630 మంది సభ్యులకు ఆతిథ్యం కల్పించినట్లు సమాచారం. ఈ ఓట్లన్నీ తమకు దక్కుతాయని ఆశించారు. కానీ, పరిస్థితి కొంత మారింది. టీఆర్‌ఎస్‌ శిబిరంలోని కొందరు సభ్యులు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేసినట్లు తెలుస్తోంది. ఇలా వందకుపైగా ఓట్లు చేజారినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవి కూడా తమ ఖాతాల్లోకి వస్తే భారీ విజయం దక్కేదని భావిస్తున్నారు. మేడ్చల్‌ ప్రాంతంలోని సభ్యులు ప్రత్యర్థి శిబిరానికి ఆకర్షితులైనట్లు చర్చ జరుగుతోంది. ఒకరిద్దరు మినహా జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు అంతా టీఆర్‌ఎస్‌కే ఓటేసినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లలో ఎక్కువ మంది అధికార పార్టీకే ఓటేశారు. గ్రామీణ ప్రాంతంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. 

అప్పుడు ఓటమి..ఇప్పుడు గెలుపు
గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాండూరు సెగ్మెంట్‌ నుంచి పోటీచేసిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి పైలెట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. ఇదే సమయంలో మహేందర్‌రెడ్డి సోదరుడు  పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ నేపథ్యంలో అప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నరేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి పోటీచేసిన మహేందర్‌రెడ్డిని విజయం వరించడం విశేషం. 

‘స్థానికత’ను సానుకూలంగామలుచుకున్న టీఆర్‌ఎస్‌
జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు ఉన్నా స్థానికేతరుడికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సానుకూంగా మలుచుకోవడంలో విజయవంతమైంది. జిల్లా నేతను కాదని స్థానికేతరునికి ఓటు ఎలా వేస్తారని సభ్యులు ఆలోచించేలా టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది. ‘సీనియర్‌ నేతగా ఎప్పుడి నుంచో మీకు అందుబాటులో ఉన్నాను.. నన్ను కాదని ఎలా పోతారు’ అని శిబిరాల్లో ఉన్న సభ్యులను మహేందర్‌రెడ్డి అడిగినట్లు తెలిసింది. స్థానిక అభ్యర్థిని బరిలోకి దించితే టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని కొందరు కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
రాజేంద్రనగర్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సోమవారం ప్రశాంతం ముగిసింది. రాజేంద్రనగర్‌లోని పీవీ నర్సింహారావు వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయంలో ఓట్ల  జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు కొనసాగింది. కౌంటింగ్‌ కేంద్రానికి ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, కాలె యాదయ్య, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.రత్నం, కార్పొరేటర్లు కోరని శ్రీలత, రావుల విజయ తదితరులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలించారు.  

సమష్టి కృషితో విజయం  
ప్రజాప్రతినిధులందరి సమష్టి కృషితో తాను భారీ మెజార్టీతో గెలుపొందినట్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం మహేందర్‌రెడ్డికి రిటర్నింగ్‌ హరీష్‌  ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరికి అందుబాటులో ఉండి అభివృద్ధిలో పాలుపంచుకుంటానన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.   

ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు
ఏ ఎన్నికలు జరిగినా గెలుపు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.  ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్ధానాలను టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగడంతో స్వల్ప తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు ఓడిపోయారన్నారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు.   

భారీ బందోబస్తు..
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాల పాత భవన సముదాయం వద్ద ఏసీపీ ఆశోకచక్రవర్తి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలను వంద మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు.

చెల్లుబాటు
కాని ఓట్లు 21ఇరు పార్టీలు నిర్వహించిన శిబిరాల్లో ఓటు ఎలా వినియోగించుకోవాలనే దానిపై సభ్యులకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. దాదాపు వారం రోజులపాటు రోజుకు రెండుసార్లు అవగాహన కల్పించినట్లు సమాచారం. అయినా, సభ్యులు సరిగా ఓటు వేయలేకపోవడం గమనార్హం. మొత్తం 797 ఓట్లు పోల్‌ కాగా.. ఇందులో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటు కాని ఓట్లలో టీఆర్‌ఎస్‌వి 3 కాగా.. కాంగ్రెస్‌వి 18 ఓట్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement