
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల గాలి మనవైపే వీస్తోందని..మనం కోరుకున్న గుర్తు ‘టీ గ్లాసు’ను ఎన్నికల సంఘం పార్టీకి కేటాయించడమే దీనికి సంకేతమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో భాగంగా శుక్రవారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ అభిమానులు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లాల వారీగా జరుగుతున్న సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.
పశ్చిమగోదావరి జిల్లా సమావేశంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ..దెందులూరు ఎమ్మెల్యే వేధిస్తున్నాడని పలువురు దళితులు నాకు చెప్పారన్నారు. అటువంటి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్టు చేయాలని..అయితే ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రభుత్వంపై ఎంతో ఆగ్రహంతో ఉన్నారన్నారు. కృష్ణా జిల్లా అభిమానుల సమావేశంలో.. జిల్లా స్థాయి కమిటీలను కాకుండా పార్లమెంటరీ స్థాయి కమిటీలు వేయాలన్న నిర్ణయానికి వచ్చానని పవన్ తెలిపారు.