వివేక్‌ ఔట్‌.. వెంకటేశ్‌కే టికెట్‌ | Peddapalli MP Seat TRS Alloted To Venkatesh | Sakshi
Sakshi News home page

వివేక్‌ ఔట్‌.. వెంకటేశ్‌కే టికెట్‌

Published Fri, Mar 22 2019 1:45 PM | Last Updated on Fri, Mar 22 2019 1:45 PM

Peddapalli MP Seat TRS Alloted To Venkatesh - Sakshi

వివేక్‌, వెంకటేశ్‌

సాక్షి, కరీంనగర్‌: పెద్దపల్లి మాజీఎంపీ, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు గడ్డం వివేకానందకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ షాకిచ్చారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు బరి నుంచి వివేక్‌ను తప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్‌ నేతకు ఈ సీటు కేటాయించారు. అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరిన తొలిరోజే ఎంపీ అభ్యర్థిగా బోర్లకుంట వెంకటేష్‌ నేత టికెట్‌ దక్కించుకున్నారు. ఆయనకు కేసీఆర్‌ శుక్రవారం బీఫారం అందజేశారు. 

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముసలం..
అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెద్దపల్లి లోక్‌సభ టీఆర్‌ఎస్‌లో పుట్టిన ముసలం చివరికి వివేక్‌ పుట్టిముంచింది. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థిగా 2017లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వివేక్‌కు కేసీఆర్‌ తగిన ప్రాధాన్యత ఇచ్చారు. వివేక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పెద్దపల్లి సిట్టింగ్‌ ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేయించారు. విచిత్రం ఏంటంటే అదే సుమన్‌ తనచేతిలో ఓడిపోయిన వెంకటేష్‌ నేతకు ఎంపీటికెట్‌ ఇప్పించడంలో కీలకపాత్ర పోషించడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోక్‌సభ పరిధిలోని ఏడు సీట్లలో టీఆర్‌ఎస్‌ రెండు సిట్టింగ్‌లను కోల్పోయింది.

మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సోమారపు సత్యనారాయణ ఓడిపోగా.. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కేవలం 500లోపు ఓట్లతో అతికష్టంగా విజయం సాధించారు. మంచిర్యాలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కేవలం 4800 ఓట్లతో గెలవగా.. పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డిది 10 వేలలోపు మెజారిటీనే. బెల్లంపల్లిలో ఏకంగా వివేక్‌ సోదరుడు గడ్డం వినోద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా పోటీ చేసి కేవలం 10వేల ఓట్లతో ఓడిపోయారు. చెన్నూరులో మిన హా ఈ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో స్వల్ప మెజారిటీనే దక్కింది. ఈ పరిణామంతో గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఓడిన సిట్టింగ్‌లూ తీవ్రంగా స్పందించా రు. ధర్మపురిలో కార్యకర్తల సమావేశంలో కొప్పుల వర్గీయులు తొలిసారిగా వివేక్‌పై నిప్పులు చెరిగారు. ఈశ్వర్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌ అభ్యర్థికి వివేక్‌ రూ.3 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

ధర్మపురిలో మొదలైన ముసలం ఎమ్మెల్యేలు బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కేవరకూ వెళ్లింది. ఈ పరిణామాలపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనాలు రావడంతో చివరికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించి వివేక్, మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే సుమన్‌ను పిలిపించి రాజీకుదిర్చే ప్రయత్నాలు చేశారు. కేటీఆర్‌ సమక్షంలోనే ఎన్నికల్లో జరిగిన పరిణామాలన్నింటినీ ఈశ్వర్, సుమన్‌ ఏకరువు పెట్టడం, మిగతా ఎమ్మెల్యేలు సైతం వంత పాడడంతో వివేక్‌పై వేటు ఖాయమని తేలింది. టికెట్ల కేటాయింపు తుదిదశకు చేరుకున్న సమయంలో గురువారం పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడా తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టిన ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా నేతకాని సామాజికవర్గానికి చెందిన బోర్లకుంట వెంకటేష్‌నేత పేరును తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఎస్సీల్లోని ఉప కుల సమీకరణలు, ఎమ్మెల్యేల మద్దతు, కాంగ్రెస్‌ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకుని వెంకటేష్‌ నేతకు సీటు ఖరారు చేశారు. 

పార్టీలో చేరకుండానే చక్రం తిప్పిన వెంకటేష్‌
అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వెంకటేష్‌ నేత పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను గమనించి పావులు కదిపారు. అప్పుడే పెద్దపల్లి లోక్‌సభపై కన్నేసిన వెంకటేష్‌ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వివేక్‌ను ఒంటరిని చేయడంతో ఆ స్థానంలోకి వెళ్లేందుకు తొలుత నేతకాని సామాజి క వర్గాన్ని అస్త్రంగా ఉపయోగించుకున్నారు.

బెల్లంపల్లి, చెన్నూరు, పెద్దపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో అదే వర్గానికి చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా నరుక్కుంటూ వచ్చారు. తనను ఓడించిన సుమ న్‌కు దగ్గరైన వెంకటేష్‌ ఆయన మద్దతు కూడగట్టుకున్నా రు. మంత్రి ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే చందర్‌ను కలిసి అవకాశం ఇప్పించాలని కోరారు. కేటీఆర్‌ సిఫారసుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ టికెట్‌ ఖరారు చేశారు. గురువారం మధ్యాహ్నం సుమన్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన వెంకటేష్‌ నేత అభ్యర్థిగా బీఫారం దక్కించుకుని రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. 

వివేక్‌ భవితవ్యం ఎటు?
పెద్దపల్లి సీటు చేజారిన వివేక్‌ రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడింది. 2013లో తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎంపీగా ఉంటూనే తన సోదరుడు వినోద్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఎన్నికలముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో వివేక్‌కు ఎంపీ సీటు ఖరారైనప్పటికీ.. తన సోదరుడు వినోద్‌కు చెన్నూరు టికెట్‌ ఇవ్వని కారణంగా పార్టీని వీడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో పెద్దపల్లి టికెట్‌ హామీతో మరోసారి టీఆర్‌ఎస్‌లో చేరారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తన సోదరుడికి టికెట్‌ విషయంలో కేసీఆర్‌ ఆగ్రహానికి గురయ్యారు. వినోద్‌ బీఎస్పీ నుంచి పోటీ చేయగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నయ్యకు వ్యతిరేకంగా తన సోదరుడిని గెలిపించేందుకు కృషి చేశారని ప్రభుత్వ నిఘావర్గాలు కేసీఆర్‌కు సమాచారం ఇచ్చాయి. అదే సమయంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా తమను ఓడించేందుకు వివేక్‌ ప్రయత్నించారని చేసిన ఫిర్యాదులతో ఆయన సీటుపై వేటు పరిపూర్ణమైంది. ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లే సాహసం చేస్తారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదు. బీజేపీ నేతలు ఇప్పటికే వివేక్‌తో టచ్‌లో ఉండి, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిని ప్రకటించలేదు. వివేక్‌ బీజేపీలో చేరితే టికెట్‌ ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంది. అయితే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో మరోసారి సాహసం చేస్తారా..? లేదా..? అనేది చూడాల్సిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement