
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ నాయకుడు, మానకొండూర్ తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో రసమయి ఆదివారం ప్రచారం నిర్వహిస్తుండా గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. గత నాలుగేళ్లలో తమకేం చేశారంటూ ఆయనను నిలదీశారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మహిళలు రసమయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు మహిళలపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణకు దిగడంతో కంది కట్కూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రసమయికి ఇదే రకమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.