
సాక్షి, న్యూఢిల్లీ: మాములుగా బాగానే ఉంటారు కానీ, ఎన్నికల సమయంలోనే పూనకం వచ్చినవాడిలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊగిపోతారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవర్ ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మోదీ పనిగా పెట్టుకున్నారని, ఈ నెల 10న ఆయన బారామతికి వస్తున్నారని, మీరే స్వయంగా ఆయన ఏం మాట్లాడతారో టీవీలో చూడువచ్చని శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో శరద్ పవర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల తన కుటుంబంపై మోదీ చేసిన వ్యక్తిగత ఆరోపణలకు పవార్ సమాదానమిస్తూ.. ‘నేను, మోదీ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. కానీ ఢిల్లీ, బారామతి, పూణేలోని వసంత్‌దాదా చక్కెర కర్మాగారం వద్ద మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికీ తెలుసు. మా కుటుంబంలో జరిగిన ఏ గొడవలైనా మోదీకి ఎలా తెలుస్తాయి? ఆయనను ఓసారి కలిసినపుడు మా కుటుంబసభ్యులు వివిధ రంగాలలో పనిచేస్తున్నారని, మేమంతా కలిసే ఉంటామని చెప్పాను’ అని పేర్కొన్నారు. మోదీ కుటుంబంలో ఏ ఒక్కరైనా ఉన్నారో.. లేదో దేశానికే తెలియదని, అటువంటి వ్యక్తి ఇతరుల కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకూడదని మండిపడ్డారు. ఒకవేళ మోదీ ఓడిపోతే, పార్లమెంటులో ఎంపీగా ఉంటారని, అపుడు తానే స్వయంగా మోదీకి వివరణ ఇస్తానని తెలిపారు.