సాక్షి, చెన్నై: అభ్యర్థులు పూలమాలలు, శాలువలు అంటే భయపడాల్సిన పరిస్థితి. తమ తమ ప్రాంతాలకు ప్రచారం నిమిత్తం వచ్చే పార్టీ అభ్యర్థుల మీద అభిమానంతో కార్యకర్తలు, ముఖ్య నాయకులు శాలువా కప్పడం, పూలమాలలు వేసి ఆహ్వానించడం సహజమే. అయితే ప్రస్తుతం అభ్యర్థులే తమకు ఆ రెండూ వద్దు బాబోయ్ అంటూ వెనక్కు తగ్గుతున్నారు. ఇందుకు కారణం ఆ శాలువ, పూలమాలలను అభ్యర్థి ఖర్చుల్లో ఎన్నికల కమిషన్ చూపిస్తుండడమే.
ఒక్కో శాలువకు రూ.రెండు వందలు చొప్పున ఈసీ లెక్కగట్టడంతో వాటి జోళికి వెళ్లొద్దంటూ కేడర్‌కు మైక్ పట్టుకుని మరీ సూచించాల్సిన పరిస్థితి. ఇందుకు తగ్గట్టుగా దక్షిణ చెన్నై డీఎంకే అభ్యర్థి తమిళచ్చి తంగ పాండియన్ పర్యటించిన చోటల్లా శాలువా సత్కారం, పూలమాలులు, పూల వర్షం హోరెత్తింది. ఇది కాస్త ఖర్చును మరింత పెంచే పరిస్థితికి తీసుకురావడంతో పక్కనే ఉన్న సైదాపేట డీఎంకే ఎమ్మెల్యే ఎం.సుబ్రమణ్యం మైక్ అందుకున్నారు. దయచేసి ఇక మీదట కార్యకర్తలు శాలువలు, పూలమాలలతో సత్కరించాల్సిన అవసరం లేదని వివరించారు. ఇది అభ్యర్థి ఎన్నికల ఖర్చుపై ప్రభావం చూపుతుందని, ఈ దృష్ట్యా ఆ రెండింటి జోలికి వెళ్లకుండా, అవసరం అయితే, నేరుగా అభ్యర్థి వద్దకు వచ్చి పలకరించి, కరచాలనం చేసి వెళ్లాలని వేడుకోక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment