ఫైనల్ టచ్
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ప్రధాన పార్టీలు బుధవారం తలమునకలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడానికి ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా, హఠాత్తుగా పర్యటన రద్దయింది.
దీంతో ఢిల్లీ నుంచే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీలు ఆయనతో ఫోనులో సంభాషించారు. మరో వైపు నగరంలోని బీజేపీ కార్యాలయంలో కూడా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. తొలి జాబితాలో బీజేపీ 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన ఎనిమిది నియోజక వర్గాలకు కూడా సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఈశ్వరప్ప, అశోక్, మాజీ మంత్రి అరవింద లింబావళి పాల్గొన్నారు.
బీఎస్‌ఆర్ సీపీ విలీనానికి మొగ్గు
రాష్ర్ట మాజీ మంత్రి శ్రీరాములు నాయకత్వంలోని బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం వైపే సమావేశంలో నాయకులందరూ మొగ్గు చూపారు. ఆ పార్టీ ఇదివరకే విలీనంపై నిర్ణయం తీసుకుందని జోషి తెలిపారు. కనుక దీనిపై సానుకూలంగా స్పందించాలని అధిష్టానాన్ని కోరామని విలేకరులతో చెప్పారు. మరో వైపు యడ్యూరప్ప తన అనుయాయులకు టికెట్లు ఇచ్చి తీరాల్సిందేనని సమావేశంలో పట్టుబట్టారు. తుమకూరు ప్రస్తుత ఎంపీ జీఎస్. బసవరాజుకు తిరిగి టికెట్టు ఇవ్వాలని, ఉడిపి-చిక్కమగళూరు స్థానానికి మాజీ మంత్రి శోభా కరంద్లాజె, బీదర్ స్థానానికి సూర్యకాంత్ నాగమారపల్లిలను ఎంపిక చేయాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
ఏ క్షణంలోనైనా జేడీఎస్ జాబితా
జేడీఎస్ తుది జాబితా ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశాలున్నాయి. 12 మందితో ఆ పార్టీ తొలి జాబితాను ఇదివరకే ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. సాధారణంగా కాంగ్రెస్, బీజేపీల కంటే చివరన జాబితాలను ప్రకటించే జేడీఎస్, ఈసారి ఆ పార్టీల కంటే ముందుగానే విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది.
జంపింగ్‌లు
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తేజస్విని రమేశ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఆమె బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. టీవీ జర్నలిస్టు అయిన తేజస్విని 2004 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి కనకపుర నియోజక వర్గంలో మాజీ ప్రధాని దేవెగౌడను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించారు. విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్‌కు ప్రత్యర్థి అయిన ఆమెకు క్రమంగా పార్టీలో ఆదరణ లభించలేదు. దీంతో బీజేపీలో చేరాలని నిర్ణయించారు.
బెంగళూరు గ్రామీణ నియోజక వర్గాన్ని ఆమె ఆశిస్తున్నప్పటికీ, ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కనుక బీజేపీ ఆమెకు ఏ బాధ్యత అప్పగిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌లో మహిళలంటే చులకన భావం ఉందని ఆమె విమర్శించారు. మరో వైపు యడ్యూరప్పకు అత్యంత ఆప్తుడైన వీ. ధనంజయ్ కుమార్ జేడీఎస్‌లో చేరనున్నారు. ఉడిపి-చిక్కమగళూరు స్థానం నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. దీనిపై ఆ జిల్లాకు చెందిన జేడీఎస్ నాయకులు బుధవారం ఇక్కడ ఆయనతో చర్చించారు.