బెంగళూరు : యడ్యూరప్ప చెప్పినట్లు జూన్ 1న తమ ప్రభుత్వం పడిపోతే.. అదే రోజున తన పదవికి రాజీనామా చేస్తానంటూ కర్ణాటక సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ కూటమి అధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి.. దాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే వారు బీజేపీలో చేరతారని.. జూన్ 1 నాటికి జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యనించారు.
తాజాగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందించారు. యడ్యూరప్ప సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారని.. మరో నాలుగేళ్లు కూడా ఇలానే చెప్తారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినంతా మాత్రాన రాష్ట్రంలో కూడా అలానే జరగాలనుకోవడం అత్యాశ అన్నారు. తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందని.. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఒక వేళ యడ్యూరప్ప చెప్పినట్లుగానే.. జూన్ 1న తమ ప్రభుత్వం కూలిపోతే.. అదే రోజున తాను తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment