బెంగళూరు: హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు విరమించారు.
గ్రామ పంచాయతీ అనుమతితో కెరగోడు గ్రామంలో గ్రామస్థులు 108 అడుగుల ధ్వజస్తంభంపై హనుమాన్ జెండాను ఎగరవేశారు. ఇందుకు సమీప 12 గ్రామాల ప్రజల నుంచి నిధులు సమీకరించారు. ధ్వజస్తంభంపై హనుమాన్ జెండా ప్రాణప్రతిష్ట కూడా పూర్తి అయ్యాక తొలగించాలని అధికారులు ఆదేశించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జెండా ఎగురవేసిన ప్రదేశం గ్రామ పంచాయతీ భవనం పరిధిలోకి వస్తుందని, ఆ జెండాను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నేడు గ్రామంలోకి వచ్చి ఆ జెండాను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీఛార్జీ చేశారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు.
ఈ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఆ ప్రదేశంలో హనుమాన్ జెండాను ఎగురవేయడం సరికాదని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌ల కుట్రపూరిత చర్యగా ఆయన ఆరోపించారు. జిల్లా ఇంఛార్జీ చెలువరాయస్వామి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేసిన ప్రదేశం పంచాయతీ భవనం ప్రదేశం పరిధిలోకి వస్తుందని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు ప్రదేశంలో హనుమాన్ జెండా ఎగురవేయాలని కోరారు.
ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment