హొసపేటె/రాయచూరు రూరల్/సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
‘‘కాంగ్రెస్ చరిత్రంతా ఉగ్రవాద, ఉగ్రవాదుల సంతుష్టీకరణమయం. ఉగ్రవాదులు హతమైతే కన్నీరు కారుస్తుంది. చివరికి సైనికులనూ అవమానిస్తుంది. సర్జికల్ దాడులకు రుజువులు డిమాండ్ చేస్తుంది. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్లో ఉగ్రవాదులు హతమయ్యారని విని కాంగ్రెస్ అత్యున్నత నేత కళ్ల వెంట బొటబొటా నీళ్లు రాలాయి! గతంలో వారికి రామునితో సమస్య. ఇప్పుడు జై బజరంగ బలీ అని నినదించే వాళ్లతో సమస్య. హనుమంతుడు పుట్టిన గడ్డకు వచ్చి ఆ రామభక్తునికి ప్రణామాలు సమర్పించే భాగ్యం నేడు నాకు దక్కింది. కానీ మన దేశ దౌర్భాగ్యం చూడండి! కాంగ్రెస్ వాళ్లు అప్పట్లో రామున్ని ఖైదు చేసినట్టే ఇప్పుడు హనుమాన్ భక్తులపైనా పడతామంటున్నారు. ఇటువంటి పనుల వల్లే ఆ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలకు పరిమితమైంది’’ అంటూ దుయ్యబట్టారు.
కర్ణాటకను కాంగ్రెస్ ఉగ్రవాదుల అడ్డాగా మారిస్తే తాము వారి వెన్ను విరిచామన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి దేశ చరిత్రలో గర్వించదగ్గ స్థానముందన్నారు. ఆ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతాన్ని కిష్కింద క్షేత్రంగా కొందరు చరిత్రకారులు భావిస్తారు.
ఇక్కడికి సమీపంలో హంపికి పక్కనే కొప్పల్ జిల్లాలో ఉన్న అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా స్థానికులు నమ్ముతారు. రాయలు చూపిన బాటలోనే దేశాన్ని కేంద్రం ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. రాయచూరు జిల్లా సింధనూరు ర్యాలీలో, చిత్రదుర్గ బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే కర్ణాటకను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఖర్గేలకు ఓటుతో బదులివ్వండి
పేదలకిచ్చిన ఏ హామీనీ నిలుపుకోని చరిత్ర కాంగ్రెస్‌దంటూ మోదీ ఎద్దేవా చేశారు. ఇప్పుడు సొంత అస్తత్వమే ప్రమాదంలో పడేసరికి మరోసారి కర్ణాటకలో హామీల పేరుతో ప్రజలను వంచించజూస్తోందని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ది ముగిసిన అధ్యాయమన్నారు. తనను విష సర్పం, పనికిరాని కొడుకు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కొడుకు ప్రియాంక్ చేసిన విమర్శలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) దొందూ దొందేనంటూ మోదీ ఎద్దేవా చేశారు.
బురదలో కూరుకుపోయిన మోదీ హెలికాప్టర్
ప్రధాని మోదీ హెలికాప్టర్ సింధనూర్ వద్ద భారీ వర్షం కారణంగా బురదలో కూరుకుపోయింది. సిబ్బంది ఎంతగానో శ్రమించి పొక్లెయిన్లు తదితరాల సాయంతో దాన్ని బయటికి లాగారు. సంబంధిత వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే అది మోదీ కోసం ఉంచిన స్పేర్ హెలికాప్టర్. అప్పటికే ఆయన మరో హెలికాప్టర్లో వెళ్లిపోయారు.
రెచ్చగొట్టే యత్నం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: హనుమాన్‌ను బజరంగ్ దళ్‌తో పోల్చడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ మండిపడింది. తద్వారా మత సెంటిమెంట్లను రగిల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. కోట్లాది హనుమద్భక్తులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment