న్యూఢిల్లీ : అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, కొన్నిసార్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ తదితర నేతలు హాజరైన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గం రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టింది. అందులో పలు అంశాలను ప్రస్తావించడంతోపాటు ఆరు ప్రత్యేక అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.
రాజకీయ తీర్మానంలోని అంశాలు ఏమిటంటే..
పారదర్శకతతో కూడిన ఆర్థిక వ్యవస్థ
అవినీతిని అంతమొందిస్తామని, నల్లడబ్బును వెనక్కు తీసుకొస్తామని ఇచ్చిన హామీ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంది. అందుకు తగినట్లు పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయం తీసుకోగా ప్రజలనుంచి కూడా అనూహ్య మద్దతు వచ్చింది. దీంతో నల్లమార్కెట్ నడ్డి విరిచినట్లయింది. ఈ నిర్ణయమే పారదర్శకతకు మార్గం చూపినట్లయింది. డిజిటల్ లావాదేవీలు కూడా అమాంతం పెరిగాయి.
వస్తు సేవల పన్ను(ఒకే దేశం.. ఒకే పన్ను)
దేశం మొత్తానికి ఒక పన్ను విధానం ఉండాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ను బీజేపీ పాలిత ప్రభుత్వం నెరవేర్చింది. పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తర్వాత ఇదే అతిపెద్ద నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా దేశంలోని వర్తకవాణిజ్య సమస్యలన్ని తీరాయి. ఈ నిర్ణయం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కక్కటిగా తీరుస్తోంది.
ఉగ్రవాదం-ప్రత్యేకవాదంపై కఠినత
ఉగ్రవాదం, ప్రత్యేకవాదం విషయంలో ఏమాత్రం సహనం తీసుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్రం కఠిన వైఖరితో ఉంది. గత ఆరేళ్లుగా ఉగ్రవాద చర్యలను తటస్థీకరించగలిగాం. ప్రపంచ వేదికలపై ఎన్నోసార్లు ఇప్పటికే ఉగ్రవాదంపై బలంగా గొంతును వినిపించారు.
మహిళలకు గౌరవం, సమానత్వంతో కూడిన జీవితం
మహిళలకు గౌరవంతో కూడిన జీవితాన్ని అందించడంతోపాటు వారి పురోభివృద్ధికై కేంద్రం పనిచేస్తోంది. భేటీ బచావో-భేటీ పఢావో, సుకణ్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన వంటి ఎన్నో పథకాలు మూడు కోట్ల మందికి లబ్ధిని చేకూరుస్తున్నాయి.
రైతు సంక్షేమ కార్యక్రమాలు
సాయిల్ హెల్త్ కార్డ్, క్రాప్ ఇన్సూరెన్స్‌లాంటి పలు పథకాలను రైతులకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతుల ఆదాయం రెండింతలు చేసే కార్యక్రమాలు తీసుకొచ్చింది. రైతుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
జాతి నిర్మాణంకోసం యువత అభివృద్ధి కార్యక్రమాలు
జాతీయ కార్యనిర్వహక వర్గం ఈ సంవత్సరాన్ని యువ ప్రోత్సాహక నామసంవత్సరంగా పరిగణిస్తోంది. దేశ నిర్మాణంలో యువతే కీలకం అయినందున వారి అభివృద్ధే ముఖ్యంగా భావిస్తున్నాం. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్, ముద్రా స్కీం, స్టార్ట్‌ప్ ఇండియాలాంటి కార్యక్రమాలతో యువతకు ఎన్నో అవకాశాలు తీసుకొస్తున్నాం.
డోక్లామ్‌పై శాంతి తీర్మానం
డోక్లామ్ విషయంలో శాంతియుత తీర్మానం చేసినందుకు జాతీయ కార్యనిర్వాహక మండలి అభినందనలు తెలియ జేస్తోంది. ఇది పరిణితిచెందిన, దౌత్య రాజకీయాల విజయంగా భావిస్తున్నాం.
బ్రిక్స్‌లో ధృఢమైన భారత్
బ్రిక్స్‌లో ధృఢమైన దేశంగా భారత్ నిలిచింది. మోదీ పది పాయింట్ల అజెండాను ప్రకటించారు. వీటి ద్వారా బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు ఎదుర్కోవచ్చు.
మౌలిక సదుపాయాల బలోపేతం
గతంలో ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ దేశంలో మౌలిక సదుపాయాలను మరింత వేగంగా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
దీన్ దయాల్ ఉపాధ్యాయ్ శతజయంతి మిషన్
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ శతజయంతి సందర్భంగా బలహీన వర్గాలకు చేయూతనందించి వృద్ధి తీసుకురావాలని భావిస్తున్నాం. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకొని పార్టీ స్థిరత్వానికి శ్రీకారం చుట్టారు. 2022 నాటికి నూతన భారత్‌ను నిర్మించాలని మోదీ తలపెట్టారు. 2022నాటి దీని లక్ష్యం కోసం సంకల్ప్ సిద్ధి ప్రోగ్రామ్ ద్వారా ముందుకు తీసుకెళతారు. ఇది జరగబోయే సత్యం.
బీజేపీ జాతీయ కార్యవర్గం చేసిన ఆరు ప్రతిజ్ఞలు
- పేదరికం రహిత భారత్
- స్వచ్ఛ భారత్
- ఉగ్రవాద రహిత భారత్
- కులాల రహిత భారత్
- మతోన్మాద రహిత భారత్
- అవినీతి రహిత భారత్