ఈసారి ఓట్ల సునామీ! | polling percentage is huge on fifth phase | Sakshi
Sakshi News home page

ఈసారి ఓట్ల సునామీ!

Published Sat, May 4 2019 5:54 AM | Last Updated on Sat, May 4 2019 5:54 AM

polling percentage is huge on fifth phase - Sakshi

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్‌ సరళి ఇక ముందు జరిగే మూడు దశల్లోకూడా కొనసాగితే ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతవరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఆ దశల్లో పోలింగు శాతం ఇప్పటి కంటే ఒక శాతం పెరిగినా స్వతంత్ర భారతంలో అత్యధిక పోలింగ్‌ శాతం నమోదయిన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టిస్తాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడయింది. ఈ ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అంచనా. ఇంత వరకు జరిగిన నాలుగు దశల్లో 67శాతం ఓట్లు పోలయ్యాయని, 2014 ఎన్నికల్లో ఇది 67.6 శాతంగా ఉందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. వచ్చే మూడు దశల్లో పోలింగ్‌ ఒక శాతం పెరిగినా ఇదే అత్యధిక పోలింగు శాతమవుతుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కర్ణాటకల్లో ఈ సారి పోలింగ్‌ శాతం గత 57 ఏళ్ల కంటే ఎక్కువగా ఉందని, 1962 నుంచి చూస్తే ఇదే అత్యధికమని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక పోలింగ్‌ జరిగింది. మహారాష్ట్రలో 30 ఏళ్లలో ఇదే ఎక్కువ పోలింగ్‌ శాతం. ప్రజలకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెరిగిందనడానికి పోలింగ్‌ శాతం పెరగడమే నిదర్శనమని నివేదిక వ్యాఖ్యానించింది.    ఈసారి ఎన్నికల్లో వృద్ధులు, మహిళలే  కాక యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొంది. అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌(రూరల్‌), రాజస్థాన్‌(రూరల్‌)లలో 18–25 ఏళ్ల ఓటర్లు పోలింగులో ఎక్కువగా పాల్గొన్నారని, వీరి పోలింగు శాతం జాతీయ సగటు పోలింగు శాతం కంటే ఎక్కువగా ఉందని నివేదిక వివరించింది.       

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement