విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, చిత్రంలో కె. హరిబాబు
సాక్షి, న్యూఢిల్లీ: స్నేహం చేసిన వారిని వంచించే అలవాటు బీజేపీకి లేదని చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. ‘నాలుగేళ్లు మా భాగస్వామిగా ఉండి ఇప్పుడు నిందా రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ స్నేహితులను చేసుకుంటుంది తప్పితే వంచించే అలవాటు లేదు. మేం స్నేహానికి విలువ ఇస్తాం.. ప్రజలను గౌరవిస్తాం.. అభివృద్ధికి విలువ ఇస్తాం.. విభజన చట్టంలో ఉన్న వాటితో పాటు లేనివీ కూడా మేం చేసిన తీరు నరేంద్ర మోదీ మహత్తుకు అద్దంపడుతుంది.
ఎందుకంటే మేం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సూత్రాన్ని నమ్ముతాం. మా నుంచి టీడీపీ విడిపోయినా ఏపీ పట్ల మా చిత్తశుద్ధి, అంకితభావం కొనసాగుతాయి. మేం ఆంధ్రప్రదేశ్‌పై దాడి చేస్తున్నామనే స్థాయికి వారి ఆరోపణలు చేరుకున్నాయి. పొత్తు వల్ల 15 సీట్లు తక్కువ వచ్చాయని ఆయన అనడం మమ్మల్ని చాలా బాధించింది. 2014లో మాతో పొత్తు లేకుంటే మీరు ఎక్కడుండేవారు. ఇలా నిందారోపణలు చేయడం సరికాదు.. ఎవరైనా వారి రాజకీయ పంథాను ఎన్నుకోవచ్చు. కానీ మేం వైఎస్సార్‌సీపీకి దగ్గరవుతున్నట్టు ఆరోపించారు. రాజకీయాలు చేయవచ్చుగానీ అవాస్తవ రాజకీయాలు చేయరాదు..’ అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఆర్థిక నేరారోపణలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేక దర్యాప్తులు చేస్తుంటాయని, జగన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, కేసు విచారణ జరుగుతోందన్నారు. టీడీపీ ఎందుకు విడిపోయిందని అనుకుంటున్నారని ప్రశ్నించగా మాకు స్నేహితులను వంచించే అలవాటు లేదు. అది మా డీఎన్‌ఏలోనే లేదు అన్నారు.
చంద్రబాబు ఆరోపణల్లో పస లేదు..
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో పస లేదన్నారు. విశ్వసనీయత లేని ఆరోపణలను ప్రజలు కూడా నమ్మరన్నారు. ఈరోజు ఆయన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో విషయం లేదని, రాజకీయంగా ఆరోపణలు చేస్తేనే నిలదొక్కుకుంటామన్న దురాశ మాత్రమే కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి మేం ఏం చేశామో ప్రజలందరికీ తెలుసునని, రెవెన్యూ లోటు కింద రూ.22 వేల కోట్లు ఇచ్చాం అంటే రాష్ట్రం పట్ల మేం శ్రద్ధ చూపినట్లా? వివక్ష చూపినట్లా? అని ఆయన ప్రశ్నించారు.
ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయకుండా, పెద్ద మొత్తంలో అప్పులు చేసి మమ్మల్ని విమర్శించడం తగునా? అన్నారు. రూ.1050 కోట్లు అభివృద్ధి నిధులు ఇస్తే వాటి ఖర్చు వివరాలు ఇప్పటికీ చెప్పలేదు.. అండర్‌గ్రౌండ్ డ్రౌనేజీకి రూ.1000 కోట్లు ఇస్తే రూ.230 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు.. జవాబుదారీ తనం లేదు. ఇంకా నిధులు రాలేదని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మనసులో ఏముందో తెలుసుకునే పరిజ్ఞానం, సామర్థ్యం తమకు లేదని, ఆయనకున్నదల్లా రాజకీయ అభద్రత మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న అభద్రతాభావానికి లోనై కూర్చున్న కొమ్మనే నరుక్కునేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ స్పెషల్ పర్పస్ వెహికిల్ ద్వారా రాష్ట్రానికి ఇచ్చే రూ.16 వేల కోట్ల వల్ల రాష్ట్ర రుణ పరిమితిపై ఎలాంటి ప్రభావం చూపబోదని, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment