
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగేళ్లుగా నిద్రపోయారు. అకస్మాత్తుగా మేల్కొని పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అంశాలను అమలుచేయాలని వామపక్ష పార్టీలు మొదట్నుంచీ డిమాండ్ చేస్తూనే వచ్చాయి. ఎవరూ కలసి రావడంలేదని టీడీపీ ఇప్పుడెలా అడుగుతుంది? ఈ ఆందోళన వెనుక ఏమైనా బేరసారాలు జరుగుతున్నాయేమోనని అనుమానించాల్సి వస్తోంది’.. అని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం అమలు చేయాల్సిందేనని, అలా కాలేదంటే అందుకు బాధ్యత ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానిది కూడా అని కారత్ స్పష్టంచేశారు.
పటిష్టంగా వైఎస్సార్‌సీపీ పునాదులు: ఇదిలా ఉంటే.. రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల స్థ్ధితిగతులను, పార్టీ నిర్మాణ స్వరూపాన్నీ, గత కార్యక్రమాల తీరును నిశితంగా సమీక్షించారు. రాజకీయ పార్టీలలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జరిగిన చర్చలో.. 23 మంది ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేసినా ఆ పార్టీ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని ప్రతినిధులు అభిప్రాయపడినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీని ఆదరిస్తున్న ఆయా వర్గాలు చెక్కుచెదరలేదని, ఆ వర్గాలలో ఆ పార్టీ బలంగానే ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు.