
నూజివీడు/గుంటూరు వెస్ట్: రాష్ట్రం విడిపోవడానికి, ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నూజివీడు, గుంటూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘువీరా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించమని నాడు రెండుసార్లు లేఖ ఇచ్చిన చంద్రబాబు నేడు ప్రత్యేకహోదా డిమాండ్ చేయకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కాగానే తొలిసంతకం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేదానిపైనేనని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ విభజన చట్టం చేసి అందులో అనేక అంశాలను పొందుపరిస్తే వాటినేమీ అమలుచేయకుండా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయని మండిపడ్డారు. కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి మాట్లాడారు.
హాయ్‌ల్యాండ్‌ను కాజేయాలని చూస్తున్నారు
విజయవాడ–గుంటూరు మధ్య ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే హాయ్‌ల్యాండ్‌ను కాజేసేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి తనయుడు ప్రయత్నిస్తున్నారని రఘువీరా ఆరోపించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు చలసాని వెంకటరామారావు కూడా శిబిరాన్ని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment