హోదాతో ఏమొస్తాయి? | CM Chandrababu Controversial Comments on AP Special Status | Sakshi
Sakshi News home page

హోదాతో ఏమొస్తాయి?

Published Wed, Feb 28 2018 2:48 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CM Chandrababu Controversial Comments on AP Special Status - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఏమొస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు కావాలని, లోటు బడ్జెట్‌ కింద రూ.16 వేల కోట్లు రావాలని, ఇవన్నీ హోదా వల్ల రావ న్నారు. చట్టంలో పేర్కొన్నట్లు ఒక హక్కుగా మాత్రమే హోదా కావాలంటున్నామని చెప్పా రు. హోదా ఇవ్వలేమంటున్నారు కాబట్టి దానికి సమానమైన ప్రత్యేక సాయానికి అంగీకరిం చామన్నారు. హోదాతో రాయితీలు వస్తాయని

ఏ జీఓలో ఉందో చూపించమంటే చూపలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌ హాలులో ఆయన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వచ్చేస్తాయని కొందరు మభ్య పెడుతున్నారని విమర్శించారు. హోదా వల్ల రాయితీలు వస్తాయని ఏ ఒక్కరూ ఏ జీఓ కూడా చూపించలేకపోతున్నారన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు తమకూ దాన్ని ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు. విభజన చట్టంలో పెట్టిన వాటిని, పార్లమెంటులో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, సంకీర్ణ ప్రభుత్వం ఉండి ఉంటే కొంత ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండేదన్నారు. బంద్‌లు, గొడవల వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని, కేంద్రం ఇచ్చిన హామీలు సాధించుకునేందుకు నిర్మాణాత్మకంగా అందరూ కలిసి పోరాడాలని చెప్పారు. 

 కేంద్రం తన బాధ్యత నెరవేర్చకపోతే ఎలా?
 విశాఖలో జరిగిన మూడవ భాగస్వామ్య సదస్సులో గతంలో కంటే నాణ్యమైన ఒప్పందాలు జరిగాయని చెప్పారు. పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నాయకులు కొందరు అడుగుతున్నారని, అది సరికాదని అన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి కదాని కేంద్రం తన బాధ్యత నెరవేర్చకపోతే ఎలాగని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లేవని చెప్పారు. మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదన్నారు. 

నా జీవితంలో ఇది కీలక దశ 
దేశంలో సంస్కరణలకు ప్రజామోదం తెచ్చింది తానేనని తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుత దశ తన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైందని గతానికి, ఇప్పటికీ పాలన, రాజకీయ, ఆర్ధిక, సామాజికపరమైన మార్పులు గణనీయంగా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అబద్ధమంటూ జగన్‌మోహన్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలావుండగా చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం ఆయన నివాసం వద్ద నిర్వహించారు. నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంపై ప్రజాదర్బార్‌ హాలు వద్ద ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తెచ్చిన పసుపు రంగు కేక్‌ను ముఖ్యమంత్రి కట్‌ చేశారు. కాగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతికి చంద్రబాబుతో పాటు నేతలు సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement