Raghuvira Reddy
-
హోదా రాకపోవడానికి బాబే కారణం
నూజివీడు/గుంటూరు వెస్ట్: రాష్ట్రం విడిపోవడానికి, ప్రత్యేకహోదా రాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమేనని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నూజివీడు, గుంటూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘువీరా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించమని నాడు రెండుసార్లు లేఖ ఇచ్చిన చంద్రబాబు నేడు ప్రత్యేకహోదా డిమాండ్ చేయకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కాగానే తొలిసంతకం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేదానిపైనేనని స్పష్టం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ విభజన చట్టం చేసి అందులో అనేక అంశాలను పొందుపరిస్తే వాటినేమీ అమలుచేయకుండా బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయని మండిపడ్డారు. కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి మాట్లాడారు. హాయ్‌ల్యాండ్‌ను కాజేయాలని చూస్తున్నారు విజయవాడ–గుంటూరు మధ్య ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే హాయ్‌ల్యాండ్‌ను కాజేసేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి తనయుడు ప్రయత్నిస్తున్నారని రఘువీరా ఆరోపించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు చలసాని వెంకటరామారావు కూడా శిబిరాన్ని సందర్శించారు. -
వైఎస్సార్ కృషివల్లే మెట్రో : రఘువీరా
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే హైదరాబాద్ నగరానికి ఈ రోజు మెట్రో రూపుదిద్దుకుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ విషయంలో తన పోరాటం వల్లే హైదరాబాద్‌కు మెట్రోరైల్ ప్రాజెక్టు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే ప్రతిపక్షాలకు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రతిపాదించి దానికి చెందిన పనులను ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. దీనికోసం వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు. -
నంద్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్
సాక్షి, అమరావతి: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం అబ్దుల్ ఖాదర్ పేరును ఖరారు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిర భవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 4 లేదా 5వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అబ్దుల్ ఖాదర్ 1994 నుంచి ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొనేవారని, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారని తెలిపారు. -
మోసకారి ‘మోదీ’ - చేతకాని ‘చంద్రబాబు’
-బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేం వచ్చిన తర్వాత ఇస్తాం -పార్లమెంటులో బీజేపీ మద్ధతుతోనే ఆనాడు రాష్ట్ర విభజన -పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్ మోసకారి నరేంద్రమోదీ, చేతకాని చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో వ్యాఖ్యలు చేయటంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి అన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే నాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఐదేళ్లు ప్రకటించిందని.. అయితే పదేళ్లు కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడు పట్టు పట్టాడాని గుర్తు చేశారు. ప్రస్తుతం వెంకయ్య ఆ విషయం గురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఆయన తన రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కోసమే హోదా డిమాండ్‌పై దష్టి సారించడం లేదని ఇలాగైతే ప్రజలే తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ తిరుపతి, విశాఖపట్నం సభల్లో అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని 11 రాష్ట్రాలకు కేవలం కేబినెట్ నిర్ణయంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే చంద్రబాబు నోరు మెదపకపోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం ఫైల్‌పై ఒక్క సంతకం చేస్తే చంద్రబాబు జైలుకెళ్తాడని, దాన్నుంచి తనను తాను రక్షించుకునేందుకు మోదీ వద్ద గట్టిగా అడగలేకపోతున్నాడని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటి వరకు కనీసం 5 శాతం కూడా మంజూరు చేయలేదన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ఇటు రాష్ట్రం అటు కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ నెల 13న కేవీపీ రామచంద్రారావు రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టే ప్రై వేటు బిల్లుకు సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాద్, జేడీయూ, ఆర్జేడీ పార్టీల మద్ధతు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఇస్తామన్నారు. అయితే అప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఉద్దేశంతోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. -
‘ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం’
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 12న ఏపీసీసీ ఆధ్వర్వంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంది. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16తేదీల్లో అన్ని జాతీయ పార్టీల నాయకులను కలిసి ప్రత్యేక హోదాతో పాటుగా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరచి అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్లో కంటి తుడుపుగా విడుదల చేసిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వాలంటే తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.