రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అన్ని జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడం కోసం ఈ నెల 12న ఏపీసీసీ ఆధ్వర్వంలో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకుల బృందం శుక్రవారం మధ్యాహ్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంది.
ఈ సందర్భంగా రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16తేదీల్లో అన్ని జాతీయ పార్టీల నాయకులను కలిసి ప్రత్యేక హోదాతో పాటుగా, పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరచి అన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్‌లో కంటి తుడుపుగా విడుదల చేసిన నిధులు ఏమాత్రం సరిపోవన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తవ్వాలంటే తక్షణం రూ. 10 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.