-బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేం వచ్చిన తర్వాత ఇస్తాం
-పార్లమెంటులో బీజేపీ మద్ధతుతోనే ఆనాడు రాష్ట్ర విభజన
-పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
హైదరాబాద్
మోసకారి నరేంద్రమోదీ, చేతకాని చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో వ్యాఖ్యలు చేయటంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా గురువారం పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి అన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే నాటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఐదేళ్లు ప్రకటించిందని.. అయితే పదేళ్లు కావాలని రాజ్యసభలో వెంకయ్య నాయుడు పట్టు పట్టాడాని గుర్తు చేశారు. ప్రస్తుతం వెంకయ్య ఆ విషయం గురించి మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆయన తన రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కోసమే హోదా డిమాండ్‌పై దష్టి సారించడం లేదని ఇలాగైతే ప్రజలే తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రధాన మంత్రి మోదీ తిరుపతి, విశాఖపట్నం సభల్లో అధికారంలోకి వస్తే పదేళ్ల పాటు హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని 11 రాష్ట్రాలకు కేవలం కేబినెట్ నిర్ణయంతోనే ప్రత్యేక హోదా ఇచ్చారన్నారు.
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే చంద్రబాబు నోరు మెదపకపోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం ఫైల్‌పై ఒక్క సంతకం చేస్తే చంద్రబాబు జైలుకెళ్తాడని, దాన్నుంచి తనను తాను రక్షించుకునేందుకు మోదీ వద్ద గట్టిగా అడగలేకపోతున్నాడని పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటి వరకు కనీసం 5 శాతం కూడా మంజూరు చేయలేదన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ ఇటు రాష్ట్రం అటు కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఈ నెల 13న కేవీపీ రామచంద్రారావు రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై ప్రవేశపెట్టే ప్రై వేటు బిల్లుకు సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాద్, జేడీయూ, ఆర్జేడీ పార్టీల మద్ధతు ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఇస్తామన్నారు. అయితే అప్పటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఉద్దేశంతోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
మోసకారి ‘మోదీ’ - చేతకాని ‘చంద్రబాబు’
Published Fri, May 6 2016 3:46 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement