హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని సి.రామచంద్రయ్య అన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ చంద్రబాబు ప్రధానితో ఏం మాట్లాడారో ప్రజలకైతే అర్ధంకాలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ప్రతిపక్షాలను ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడంలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ గతంలో మన్మోహన్ కేబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు.
మోదీకి ధైర్యముంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మన్మోహన్ కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయలన్నారు. లేదంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ప్రత్యేక హోదా అంశానికి చట్టబద్దత కల్పించాలన్నారు. నీతి అయోగ్ కేవలం అమలు చేసే కార్యనిర్వాహక సంస్థ మాత్రమేనన్నారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సాధించటం చేతకాకపోతే తప్పుకోవాలని సూచించారు.